
గళమెత్తిన గంగపుత్రులు
నక్కపల్లి: ప్రమాదకర రసాయన పరిశ్రమల ఏర్పాటుపై గంగపుత్రులు గళమెత్తారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాజయ్యపేటకు చెందిన వందలాది మంది మత్స్యకారులు సారిపల్లిపాలెం జంక్షన్ నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుల, వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు ఎరిపల్లి నాగేష్ ఆధ్వర్యంలో కార్యాలయం వరకు వచ్చి అక్కడ ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు కె.లోకనాథం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, మత్స్యకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు ప్రాంతాల్లో ఈ బల్క్ డ్రగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోందని, వాటిలో నక్కపల్లి ఒకటన్నారు. ప్రాజెక్టు రిపోర్ట్‌లో 1270 ఎకరాల్లో బల్క్‌డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని, ఇప్పటికే 2వేల ఎకరాలు కేటాయించారన్నారు. ఇది చాలదన్నట్లు జానకయ్యపేట, సీహెచ్‌ఎల్ పురం, పెదతీనార్ల, గుర్రాజుపేట గ్రామాల్లో మరో 800 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇన్ని వేల ఎకరాలు ఎవరి కోసం సేకరిస్తున్నారని నిలదీశారు. ఒక పక్క బల్క్ డ్రగ్ పార్క్‌ను రాజయ్యపేట, పరిసర గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఈ నెల 6న ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కంపెనీలు ఏర్పాటు చేయబోమని గతంలో హోంమంత్రి అనిత పలు సందర్భాల్లో ప్రకటించారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అందలేదని పోరాటాలు చేస్తుంటే మరో పక్క ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై మత్స్యకారులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ డీటీ నారాయణరావుకు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో ఎంపీటీసీలు లొడగల చంద్రరావు, కొల్నాటి బుజ్జి, గొర్ల గోవిందు, గంటా తిరుపతిరావు, సర్పంచ్ ముసలయ్య, రైతు నాయకులు తళ్ల భార్గవ్, గొర్లె బాబూరావు, యలమంచిలి తాతబాబు, బొంది గోవిందు, దేవర నూకరాజు, కాశీరావు, మనబాల రాజేష్, పిక్కి నూకరాజు, యజ్జల అప్పలరాజు పాల్గొన్నారు.
పేనాలు తీసే కంపెనీలన్నీ మావద్దే..
పేనాలు తీసే కంపెనీలన్ని మా దగ్గరే పెడుతున్నారు. మేం బతకొద్దా. ఎం పాపం చేసామని, ఇప్పటికే కంపెనీల వల్ల సానా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ భూములు తీసుకుని ఏదో పార్క్ పెడతామంటున్నారు. మా వోళ్లంతా భయపడిపోతున్నారు, పెబుత్వం దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అందుకే ఆఫీస్‌కు వచ్చి ధర్నా సేత్తన్నం. ఆరో తేదీన జరిగే మీటింగ్ అడ్డుకుంటాం.
– ఎరిపిల్లి నాగేష్, మత్స్యకారుడు
మమ్మల్ని బతకనివ్వరా?
మందుల కంపెనీల వల్ల సానా నట్టపోయాం. మళ్లీ కొత్త కంపెనీలు పెట్టి మమ్మల్ని బతకనివ్వరా. ఏటకు ఎల్తే సేపలు దొరకడం నేదు. కొన్ని సేపలను తింటే జబ్బులొస్తున్నాయి. కొత్తగా ఏదో కంపెనీ పెడతారంట. ఇక్కడ సానా కంపెనీలు వత్తాయి అంటన్నారు. భూములు, ఇళ్లు తీసేసుకుంటన్నారు. పెబుత్వం మమ్మల్ని ఏంసేద్దామని ఇవ్వన్ని పెడతన్నారు. అందరూ బాగానే ఉంటా, పక్కన కాపురాలు సేసే మాకే నట్టం.
– పిక్కి తాతీలు, మాజీ ఎంపీటీసీ
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు, అఖిల పక్ష నాయకులు
ప్రభుత్వానికి
పారిశ్రామికవేత్తలే ప్రధానం
బల్క్ డ్రగ్ పార్క్ అనేది అణుబాంబు లాంటిది. ఇక్కడ వందలాది యూనిట్లు స్థాపిస్తారు. భవిష్యత్‌లో పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఆరోగ్యంగా జీవించే పరిస్థితి ఉండదు. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకించిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిపుణుల నివేదిక ప్రకారం బల్క్ డ్రగ్ పార్క్ చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా రెడ్‌జోన్‌లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పారిశ్రామిక వేత్తలే ముఖ్యంగా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుని తీరుతాం.
– కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
రైతులను రోడ్డున పడేస్తారా?
ప్రమాదకర పరిశ్రమలను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదనంగా భూములు తీసుకుని రైతులను రోడ్డును పడేయాలని చూస్తున్నారు. భూములు ఇవ్వమని రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులు, బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. 6న ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాల్సిందే.
– శీరం నర్సింహమూర్తి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు
వేట లేక మత్స్యకారులు వలస బాట
మందుల కంపెనీల వల్ల ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల మత్స్యకార గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. వేట లేక ఉపాధి కోల్పొతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
– గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు
బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ధర్నా
జాతీయ రహదారిపై భారీ ర్యాలీ
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ నినాదాలు

గళమెత్తిన గంగపుత్రులు

గళమెత్తిన గంగపుత్రులు

గళమెత్తిన గంగపుత్రులు

గళమెత్తిన గంగపుత్రులు

గళమెత్తిన గంగపుత్రులు