సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా ఈ పూజను చేపట్టారు. లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించి.. విశేష హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదం అందజేశారు. అలాగే.. సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడామండపంలో తిరువీధిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ కూడా వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిని అందంగా అలంకరించారు.ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.