పిడుగుపాటుకుపశువులు మృత్యువాత
రావికమతం: మండలంలో పిడుగుపాటుకు 16 మేకలు, పాడి ఆవు మృత్యువాత పడ్డాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షంతో భారీగా పిడుగులు పడ్డాయి. రావికమతం శెట్టివారి పాకలు వద్ద వర్షానికి చింత చెట్టు కిందకు మేకలు వెళ్లగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో సీరా సాంబ, రమణ, దేవర అప్పలనాయుడు, నమ్మి వెంకటస్వామిలకు చెందిన 14 మేకలు, కేబీపీ అగ్రహారంలో దేవర అప్పారావుకు చెందిన 2 మేకలు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టవానిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధిత రైతు మైచర్ల విశ్వనాథం తెలిపారు.


