మునగపూడిలో షర్మిలకు చేదు అనుభవం.! | Sakshi
Sakshi News home page

మునగపూడిలో షర్మిలకు చేదు అనుభవం.!

Published Sun, Feb 11 2024 1:24 AM

- - Sakshi

నాతవరం: మునగపూడి రచ్చబండ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె వ్యవహారశైలిని విమర్శిస్తూ స్థానిక వైఎస్సార్‌ అభిమానులు నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్‌ పేరును.. ఆయన మరణాంతరం చార్జిషీట్‌లో చేర్చి వారి కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన విషయాన్ని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ సాక్షిగా ప్రశ్నించారు. వైఎస్సార్‌ బిడ్డగా అలాంటి పార్టీలో మళ్లీ ఎందుకు చేరారు..? అంటూ వైఎస్సార్‌ అభిమాని లోవరాజు నిలదీశారు.

వైఎస్సార్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించిన పార్టీలో కాకుండా మరే పార్టీని గెలిపించమన్నా.. వైఎస్సార్‌ బిడ్డగా మద్దతు ఇచ్చేవాళ్లమని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ప్రశంసించారు. దీంతో షర్మిల ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పది నిమిషాలపాటు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారు. ఈ క్రమంలో అతడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నేతలు మైక్‌ లాక్కోన్నారు. అంతలోనే షర్మిల కలగజేసుకుని తనను మాట్లాడనివ్వండని నాయకులకు సూచించారు.

లోవరాజు మాట్లాడుతున్నంత సేపు సభలో ఉన్న వారంతా ఈలలతో సందడి చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్‌ పేరు చార్జిషీట్‌లో చేర్చిన విషయం సోనియా, రాహుల్‌ గాంధీలకు తెలియదని తన దగ్గర బాధపడ్డారన్నారు. రాష్ట్రంలో అధికార పక్ష, ప్రతి పక్ష నాయకులు బీజేపీ పెద్దల కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులాంటివి పూర్తవ్వాలంటే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి, రుద్రరాజు, పీసీసీ సభ్యుడు శ్రీరామమూర్తి, నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి సుబ్బ న్న, సన్యాసిరావు పాల్గొన్నారు.

నిలదీస్తున్న లోవరాజు మైక్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు
1/2

నిలదీస్తున్న లోవరాజు మైక్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

2/2

Advertisement
Advertisement