సాక్షి, పాడేరు: మన్యంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు మండలాల పరిధిలోని 87 పంచాయతీలు, 527 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో ఆయా కేంద్రాలకు తరలివెళ్లారు. నాలుగు మండలాల్లో మొత్తం 880 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 1,955 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వీరిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు 176 ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను వినియోగించారు.
భారీగా అభ్యర్థులు
రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. నాలుగు మండలాల్లోని 87 సర్పంచ్ స్థానాలకు 452 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మండలాల వారీగా అనంతగిరిలో 24 పంచాయతీలకు 101 మంది, జి.మాడుగులలో 17 పంచాయతీలకు 98 మంది, పెదబయలులో 23 పంచాయతీలకు 133 మంది, ముంచంగిపుట్టులో 23 పంచాయతీలకు 120 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 527 వార్డు స్థానాలకు 1,315 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అనంతగిరిలో 136 స్థానాలకు 342 మంది, జి.మాడుగులలో 153 స్థానాలకు 407 మంది, పెదబయలులో 136 స్థానాలకు 331 మంది, ముంచంగిపుట్టులో 102 స్థానాలకు 235 మంది పోటీలో ఉన్నారు. దీంతో మన్యంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మండలాల వారీగా ఓటర్లు
జి.మాడుగుల : 44,674
ముంచంగిపుట్టు : 38,895
పెదబయలు : 43,324
అనంతగిరి : 38,286
నేడు నాలుగు మండలాల్లోపంచాయతీ పోరు
87 పంచాయతీలు,527 వార్డు స్థానాలకు పోలింగ్
బరిలో 452 మంది సర్పంచ్ అభ్యర్థులు,
1,315 మంది వార్డు అభ్యర్థులు
కేంద్రాలకు చేరిన సిబ్బంది


