● హ్యాట్రిక్‌లు, వారసత్వపు గెలుపులు!
● వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవా
చింతపల్లి: మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, కొమ్మంగి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా మూడోసారి విజయం సాధించడం విశేషం. పెదబరడ పంచాయతీలో గత ఎన్నికల్లో కుమారుడు గెలుపొందగా, ఈసారి తల్లి విజయం సాధించారు.
మూడోసారి లంబసింగి పీఠం కై వసం
లంబసింగి పంచాయతీలో కొర్రా రఘునాథ్ మూడోసారి విజయం సాధించారు. 2013లో తొలిసారి వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలుపొందిన ఆయనకు, 2018లో మహిళలకు స్థానం కేటాయించడంతో ఆయన భార్య శాంతికుమారి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి జనరల్ కావడంతో రఘునాథ్ మళ్లీ బరిలోకి దిగి గెలుపొందారు. ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా రఘునాథ్‌కు 499 ఓట్లు వచ్చాయి. సమీప టీడీపీ మద్దతు అభ్యర్థికి 454 ఓట్లు లభించాయి. లోచలి వరప్రసాద్‌కు 289, కుడుముల సుందరరావుకు 232, కొర్రా శాంసన్‌కు 226 ఓట్లు వచ్చాయి.
కొమ్మంగిలోనూ హ్యాట్రిక్
కొమ్మంగి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు మూడోసారి సర్పంచ్‌గా విజయం సాధించారు. ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా తన సమీప కూటమి మద్దతు అభ్యర్థి వంతల లక్ష్మణరావుపై 118 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో ఈ రెండు పంచాయతీల్లోనూ వరుసగా మూడోసారి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించినట్లయింది.
నాడు తనయుడు.. నేడు తల్లి విజయం
పెదబరడ పంచాయతీలో ఆసక్తికర ఫలితం నమోదైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో కుమారుడు సిమిడి గోపాల్ విజయం సాధించగా, ఈసారి ఆయన తల్లి సిమిడి సోములమ్మ సర్పంచ్‌గా గెలుపొందారు. ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా జనసేన మద్దతు అభ్యర్థి తూబిరి గంగాభవానికి 542 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి మర్రి సింగారికి 639 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి సోములమ్మ 682 ఓట్లు సాధించి 43 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ మద్దతు అభ్యర్థి వంతల దుర్గకు 260 ఓట్లు లభించాయి. దీంతో పెదబరడలోనూ వరుసగా రెండోసారి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే సర్పంచ్ పీఠం దక్కింది.


