● పాడేరు డీఎస్పీ వేణుగోపాల్
అరకులోయ టౌన్: మహిళల భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మహిళా పరిరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాడేరు డీఎస్పీ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం మండలంలోని పానిరంగిని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ‘మహిళా భద్రత– చట్టాలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ... సమాజంలో మహిళలను గౌరవం, ప్రేమ, అనురాగాలతో చూడాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రతి ఒక్క మహిళకూ వారి పరిరక్షణ చట్టాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించినట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్యలు, వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని హామీ ఇచ్చారు.
శక్తి యాప్ వినియోగించాలి : విద్యార్థినులు సోషల్ మీడియా ఉచ్చులో పడి మోసపోవద్దని డీఎస్పీ హెచ్చరించారు. ప్రతి మహిళా తప్పనిసరిగా తమ స్మార్ట్‌ఫోన్లలో ‘శక్తి యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం ఎదురైనప్పుడు శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడతామని వివరించారు. ఇదే సమయంలో బాలికల పరిరక్షణకు సంబంధించిన పోక్సో చట్టం అంశాలను, దాని ప్రాముఖ్యతను విద్యార్థినులకు కూలంకషంగా వివరించారు. కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.


