ప్రయాణం.. నిత్య నరకం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం.. నిత్య నరకం

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

అసంపూర్తిగా ఉన్న జామిగుడ వంతెనపై నుంచి వరద ప్రవాహం

పొంగి ప్రవహిస్తున్న కించూరు గెడ్డ

పెదబయలు: గ్రామం దాటి బయటకు వెళ్లాలన్నా, చివరకు ఊరిలోని ఒక వీధి నుంచి మరో వీధికి వెళ్లాలన్నా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని గెడ్డ దాటాల్సిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని రాయిమామిడి జంక్షన్‌ నుంచి ఇంజరి వరకు రోడ్డు పనులు పూర్తి చేశారు. జంగంపుట్టు నుంచి కించూరు వరకు రోడ్డు మంజూరై నిర్మాణం జరుగుతోంది. కానీ, సరిగ్గా గ్రామం ముందే అడ్డంగా ఉన్న గెడ్డపై మాత్రం వంతెన నిర్మించడం మరిచారు. కించూరు పరిధిలోని మూడు వీధుల్లో ఉన్న 85 కుటుంబాలు, 350 మంది జనాభా రోజువారీ అవసరాలకు, అత్యవసర వైద్యానికి ఈ గెడ్డ ప్రవాహంలోనే సాహసం చేస్తున్నారు.

● మరొకవైపు జామిగుడ–గుంజివాడ గ్రామాల మధ్య ఉన్న గెడ్డ ఏకంగా ఏడు గ్రామాలకు శాపంగా మారింది. గుంజివాడ, తారాబు, చింతలవీధి, జడిగుడ, గబ్బర్ల, సరిగుడ, తల్లాబు వీధి గ్రామాల్లోని సుమారు 1,100 మంది గిరిజనులు ఏటా వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నారు. గత ప్రభుత్వంలో రూ. 2 కోట్లతో జామిగుడ వంతెనకు శంకుస్థాపన చేసినా.. స్థల వివాదాలు, పాలకుల నిర్లక్ష్యంతో రెండేళ్లలో కేవలం పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి.

మృత్యువాత పడుతున్నా..

ఏటా వరద ఉధృతిలో గెడ్డ దాటుతూ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు గిరిసీమలో నిత్యకృత్యమయ్యాయి. అత్యవసర సమయంలో 108, 104 అంబులెన్సులు సైతం జామిగుడ గెడ్డ వరకే వచ్చి ఆగిపోతుండటంతో, వైద్యం అందక మార్గమధ్యలోనే ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి కించూరు గెడ్డపై కొత్త వంతెన మంజూరు చేయాలని, అసంపూర్తిగా ఉన్న జామిగుడ వంతెన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని గిరిజనులు గళమెత్తుతున్నారు.

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలుదాటినా.. డిజిటల్‌ ఇండియా వైపు అడుగులు వేస్తున్నా.. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు దయనీయపరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.పెదబయలు మండలంలో గెడ్డలపైవంతెనల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునిరాకపోకలు సాగిస్తున్నారు.

కించూరు గెడ్డపై వంతెన లేక అవస్థలు

వర్షాకాలంలో నిత్యం నరకమే

గెడ్డ దాటాలంటే ప్రాణాలకుతెగించాల్సిందే

సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం

గిరిజనుల అవేదన

వినతులిచ్చినా చర్యలు శూన్యం

మండలంలోని కించూరు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న గెడ్డకు వంతెన నిర్మాణం చేయాలని అనేక సార్లు అధికారులకు, ప్రభుత్వానికి అర్జీలు పెట్టినా మంజూరు చేయటం లేదు. దీంతో గ్రామం నుంచి కాలు బయటపెట్టాలన్నా గెడ్డ దాటాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వంతెన మంజూరు చేయాలి. గెడ్డ దాటుతూ ఏటా ప్రమాదాలు జరిగి గ్రామస్తులు అనేకమంది మృత్యువాత పడిన ఘటనలున్నాయి. వంతెన నిర్మాణంతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

– బూడిదే చిట్టిబాబు,

కించూరు, పెదబయలు మండలం

నిధులు మంజూరైన వెంటనే పనులు

జామిగుడ సమీపంలో నిర్మాణం జరుగుతున్న రూ. 2 కోట్లకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరో రూ. 1.80 కోట్లు అంచనా పెంచి అధికారులకు నివేదించడం జరిగింది. అదనపు నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

– డి.రాము, ఏఈ,

ట్రైబల్‌ వెల్ఫేర్‌, పెదబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement