గాయపడిన శిశువు చికిత్స పొందుతూ మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన శిశువు చికిత్స పొందుతూ మృతి

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

ఊహించని ప్రమాదంలో తీవ్ర గాయాలు

బైక్‌ ఢీకొనడంతో ఘటన

పెదబయలు: ఆస్పత్రిలో చికిత్స పొంది బాబు ఆరోగ్యం కుదుటపడిందన్న సంతోషంతో ఇంటికి తిరిగి వస్తుండగా, ఊహించని రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆ కుటుంబాన్ని దెబ్బతీసింది. ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో రెండు నెలల పసికందు మృతి చెందిన విషాద సంఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు మండలం సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన గొల్లోరి జయరాం, శ్రీమొత్తి దంపతుల రెండు నెలల కుమారుడు సంజయ్‌కుమార్‌కు టీకా వేసిన ప్రదేశంలో వాపు వచ్చి ఇన్‌ఫెక్షన్‌ అయింది. దీంతో 13 రోజుల క్రితం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్యులు శస్త్రచికిత్స చేసి బాబును కాపాడారు. బాబు పూర్తిగా కోలుకోవడంతో ఈ నెల 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై బాబును తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ ముసిడిపుట్టు జంక్షన్‌ వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద బైక్‌ నిలిపి బాబుకు తల్లి పాలు పడుతోంది. ఆ సమయంలో పెదబయలు వైపు నుంచి వేగంగా వచ్చిన మరో బైక్‌ వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీమొత్తి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, పసికందు తలకు బలమైన గాయమైంది. వెంటనే వారిని ప్రైవేటు వాహనంలో పెదబయలు ఆస్పత్రికి, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 11.30 గంటలకు బాబు మృతి చెందాడు. బాబు బాగుపడ్డాడని సంతోషంతో ఇంటికి వెళ్లేలోపే తిరిగి ఆస్పత్రి పాలై ప్రాణాలు కోల్పోయాడు.. అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ టి. వెంకటేష్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన సీకరి పంచాయతీ వెల్లపాలెం గ్రామానికి చెందిన గుంజిలి పుణ్యారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement