● జిల్లా పర్యాటక శాఖ అధికారి చలపతిరావు
పాడేరు రూరల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చే రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025–26కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పర్యాటక శాఖ అధికారి చలపతిరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రిసార్టులు, హోటళ్లు, లాడ్జిలు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, విద్యా సంస్థలు, చలనచిత్ర రంగం, డిజిటల్ మాధ్యమాలతో పాటు వివిధ రంగాల సేవలను ఈ పురస్కారాల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 18వ తేదీలోగా టూరిజం అథారిటీ విజయవాడ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా గానీ, లేదా అధికారిక టూరిజం వెబ్‌సైట్ ద్వారా గానీ తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికై న విజేతలకు సెప్టెంబర్ 27న జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఈ విశిష్ట పురస్కారాలను అందజేస్తామని తెలిపారు.


