సర్వర్‌ ఏడిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ ఏడిపింఛెన్‌

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

● పింఛన్‌ దరఖాస్తులకు పాట్లు ● సచివాలయాల్లో తప్పని పడిగాపులు ● కూటమి నేతల కనుసన్నల్లో ఆన్‌లైన్‌

నాతవరం: సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు పెద్దఎత్తున సచివాలయాలకు తరలివస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగుస్తుండడంతో పరుగులు పెడుతున్నారు. అయితే, దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌ చేసేందుకు పలు సచివాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఒక్కో దరఖాస్తుదారుని వివరాలను నమోదు చేయడానికి గంటకు పైగా సమయం పడుతుండడం... మరోపక్క బుధవారంతో గడువు ముస్తుండడంతో ఆందోళన చెందుతూ దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాయవలసి వస్తోంది. మండలంలో మంగళవారం నాతవరం, మర్రిపాలెం, డి.యర్రవరం గ్రామ సచివాలయాల్లో పింఛన్‌దారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. డి.యర్రవరం సచివాలయంలో సర్వర్‌ మొరాయించడంతో గంటల తరబడి నిరీక్షించవలసి వచ్చింది. నాతవరం సచివాలయానికి అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మర్రిపాలెం సచివాలయంలో నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా సిబ్బంది రావడంతో దరఖాస్తుదారులు బయట వేచి ఉండాల్సి వచ్చింది. కూటమి నేతల ఆదేశాల మేరకే సిబ్బంది ఆన్‌లైన్‌ చేస్తున్నారంటూ పలువురు ఆరోపించారు.

మందకొడిగా నమోదు

బుచ్చెయ్యపేట: మండలంలో కొత్త పింఛన్ల నమోదు మందకొడిగా సాగుతోంది. 35 పంచాయతీల్లో ఇప్పటి వరకు 1,400 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, కేవలం 147 దరఖాస్తులు మాత్రమే ఎంపీడీవో లాగిన్‌లోకి వచ్చాయి. మిగిలిన దరఖాస్తులన్నీ డీఏ, వెల్ఫేర్‌ లాగిన్‌లోనే ఉన్నాయి. ఎంపీడీవో లాగిన్‌లోకి వచ్చిన వారికి మాత్రమే కొత్త పింఛన్లు మంజూరవుతాయి. బుధవారంతో పింఛన్ల నమోదు గడువు ముగుస్తుండడంతో తమకు పింఛన్‌ మంజూరు అవుతుందో లేదోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

కె.కోటపాడు: స్థానిక గ్రామ సచివాలయంలో ఇప్పటి వరకూ 80 మంది పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి శ్రీను తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు సచివాలయానికి వచ్చారు.

రోలుగుంట: మండలంలోని 15 సచివాలయాల వద్ద పింఛన్‌ దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఎంపీడీవో పర్యవేక్షణలో జరిగింది. విద్యుత్‌ కోత, సర్వర్లు పనిచేయకపోవడం తదితర సమస్యలతో ఆన్‌లైన్‌లో తీవ్ర జాప్యం జరిగింది. ప్రతి సచివాలయం వద్ద టీడీపీ నాయకులు వచ్చి హడావుడి చేశారు.

మునగపాక: అర్హులైన పేదలకు పింఛన్‌లు అందించే కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకునే లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల హడావుడి ఎక్కువైపోతుందంటూ పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేతల ప్రమేయం లేకుండా పింఛన్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉన్నా కొంతమంది కూటమి నేతలు మాత్రం స్వర్ణ మునగపాక–1, 2 వద్ద హంగామా చేస్తున్నారు. దీంతో అటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు ఇటు దరఖాస్తులు చేసుకునే వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పింఛన్‌ దరఖాస్తు ప్రక్రియ సక్రనంగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement