సాక్షి, పాడేరు: అధిక వర్షాలతో నిత్యం పచ్చగా ఉండే మన్యం పరిస్థితి ఈ ఏడాది భిన్నంగా ఉంది. ఎల్ నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో చాలా ప్రాంతాల్లో తగినంత వర్షాలు కురవ లేదు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో వరితో పాటు ఇతర చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయలు సాగు చేస్తారు. సాగునీటి వనరులు లేకపోవడంతో గిరిజన రైతులంతా వర్షాధారంతోనే పంటలు పండిస్తారు. జిల్లాలో గత ఏడాది 41,608 హెక్టార్లలో వరి సాగు చేయగా, ఈ ఏడాది సుమారు 50 శాతంలో మాత్రమే వరి నాట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 75 శాతం భూముల్లో నాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు.
6,941 హెక్టార్లలో వరినాట్లు కరువు
జిల్లాలో ఆగస్టు నెలాఖరు నాటికి 100 శాతం వరినాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు 34,667 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇంకా 6,941 హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. వరినారు ముదిరిపోవడంతో నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో అధిక వర్షాలతో 95 శాతం వరకు వరినాట్లు పూర్తవగా... అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి మండలాల్లో 85 శాతం పడ్డాయి. కొయ్యూ రు మండలంలో 60 శాతం భూముల్లో వరినాట్లు పడలేదు.
తగ్గిన వర్షపాతం
అధిక వర్షాలకు పేరొందిన మన్యంలో ఈ ఏడాది జూన్ నెల నుంచే వర్షాలు ముఖం చాటేశాయి. ఎల్ నినో ప్రభావంతో తగినంతగా వర్షాలు కురవలేదు. జూన్ నెలలో 154 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 73 మిల్లీమీటర్లు, జూలై నెలలో 286 మిల్లీమీటర్లకు గాను 184, ఆగసులో 685 మిల్లీమీటర్లకు గాను కేవలం 379 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మున్ముందు వర్షాలు కురవని పక్షంలో ఇంతవరకు పూర్తిచేసిన 34,667 హెక్టార్ల వరినాట్లకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరినాట్లు పడని హుకుంపేట మండలం ఉర్రాడలో పొలాలు


