సాక్షి, పాడేరు: జిల్లాలో అధికారుల పనితీరు మెరుగుపడాలని, కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఇటీవల సీఎం చంద్రబాబు గన్నెల గ్రామంలో పర్యటించి ఐవీఆర్‌ఎస్ కాల్స్, పీపీపీ పనితీరు సమీక్షలో కొంతమంది అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి అమలుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాలన్నారు. ప్రతిరోజు ఉద యం 11 గంటలకు సిబ్బంది హాజరు తనకు అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, హెచ్‌డీఎస్ నిధులు సద్వినియోగం చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ జిల్లాకు వచ్చే సమయానికి అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ పెండింగ్ పనులు పూర్తి
ఓటర్ల జాబితా సవరణ పెండింగ్ పనుల పూర్తికి అధికారులంతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. ఎన్నికల విభాగం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురిస్తామని చెప్పారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులన్నింటిని గడువులోగా పూర్తి చేయాలన్నారు. అధిక సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్న అరకులోయ మండలంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న విచారణలు, నోటీసుల జారీ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాని పక్షంలో తగిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
3,303 పెండింగ్ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం
జిల్లాలోని పీఎం జన్‌మన్ పథకంలో పెండింగ్‌లో ఉన్న 3,303 ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంతి గృహనిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.


