ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా ఎలుగుబంటి హల్‌చల్ చేస్తోంది. కొండ ప్రాంతంలో పనులు చేస్తున్న సమయంలో ఒనకఢిల్లీ రైతులకు సోమవారం ఎలుగుబంటి కనిపించింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఎలుగుబంటి గ్రామంలోకి రాకుండా అటవీ ప్రాంతం వైపు తరిమివేశారు. మూడు రోజులుగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటి ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పలువురు పోస్టులు పెట్టారు.
అప్రమత్తంగా ఉండాలి
సరిహద్దులో ఎలుగుబంటి సంచారంపై ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ తన సిబ్బందితో సోమవారం వనుగుమ్మ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎలుగుబంటి సంచరించే ప్రాంతాల గురించి ఆరా తీశారు. ప్రజలకు ఎలుగుబంటి కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుంపుగా మాత్రమే వెళ్లాలని, ఎలుగుబంటి మళ్లీ కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు నారాయణపడాల్, వెంకటరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


