బుచ్చెయ్యపేట: హిందూ సంప్రదాయం ప్రకారం తొలి పూజ చేసేది వినాయకుడికే.. హిందువులు ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు తొలగించే గణనాథుడినే వేడుకుంటారు. ఇందుకోసం గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. రంగురంగుల అలంకరణలతో వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా వీటిని శిల్పికళాకారులు తీర్చిదిద్దుతున్నారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు. వచ్చే నెల 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలు సైతం గ్రామాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
పలు రూపాల్లో విగ్రహాలు
మేజర్ పంచాయతీ వడ్డాది, బుచ్చెయ్యపేట, సీతయ్యపేట, విజయరామరాజుపేట, రాజాం తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి తయారీతో స్థానికంగా పలువురి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. విజయ వినాయక, లంబోదర వినాయక, బుద్ధి వినాయక, పంచముఖ వినాయక, పార్వతీపరమేశ్వర్ల సన్నిధి వినాయక, ఊయలలో ఊగుతున్న వినాయక, శ్వేత నాగు బంధ వినాయక, గోవుపై ఊరేగుతున్న వినాయక వంటి పలు ఆకారాల్లో తయారు చేస్తున్నారు. మట్టితోపాటు కొబ్బరి పీచు, అట్టలు, ఇతర ముడి సరుకులతో వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ఒక్కో విగ్రహాన్ని పరిమాణం బట్టి రూ. 100 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. వినాయ విగ్రహాలు తయారీతో శిల్పి కళాకారుల కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వినాయక చవితి నుంచి దసరా ఉత్సవాల వరకు వీరికి చేతినిండా పని దొరుకుతుంది.
తయారవుతున్న కాల సర్ప వినాయక విగ్రహం
ఆకట్టుకుంటున్న విజయ వినాయక విగ్రహం
రంగులతో ఆకట్టుకుంటున్నపంచముఖ వినాయక విగ్రహం
వినాయక విగ్రహాల తయారీ 15 అడుగుల ఎత్తు వరకు సిద్ధం వివిధ ఆకృతుల్లో ముస్తాబు
చేతినిండా పని
విగ్రహాల తయారీపై ఆధార పడి జీవిస్తున్నాం. మా కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబీకులకు ఉపా ధి కల్పిస్తున్నాం. ఈ ఏడాది విగ్రహాల తయారీకి ముడిసరుకు ధరలు పెరిగాయి. 15 అడుగుల విగ్రహాలు వరకు తయారు చేశాం. పలు గ్రామాల నుంచి వస్తున్న ఆర్డర్లు మేరకు పలు ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు అందుబాటులో ఉంచాం.
–కె లోవరాజు, విగ్రహాల తయారుదారుడు, వడ్డాది


