ఏయూ భూతర్పణం! | - | Sakshi
Sakshi News home page

ఏయూ భూతర్పణం!

Aug 28 2026 12:27 AM | Updated on Aug 28 2026 12:27 AM

ఎడాపెడా భూ బదలాయింపులతో

వర్సిటీకి తీవ్ర నష్టం

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పప్పుబెల్లాల్లా పంపకాలు

యూనివర్సిటీకి పరిహారం మాత్రం శూన్యం

మరోసారి కేటాయింపునకు రంగం సిద్ధం

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ భవిష్యత్‌ అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాల కోసం పూర్వీకులు ఇచ్చిన విలువైన భూములను ప్రజా ప్రయోజనాల సాకుతో పలు సంస్థలకు బదలాయింపులు జరిగిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ‘భూ’తర్పణం చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన భూములకే సరైన పరిహారం రాకపోగా.. మళ్లీ భూములను కట్టబెట్టడంపై ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఏయూ భూములు చేజారిపోతుండటంపై విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో వరుస కేటాయింపులు

● 1991లో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని 2 ఎకరాల ఏయూ భూమిని రైతుబజార్‌ కోసం, మరో ఎకరాన్ని జీవీఎంసీ వినియోగానికి కేటాయించారు. ఆ భూమిలో టెన్నిస్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేసినప్పటికీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి పరిహారం అందలేదు.

● 1999లో మధురవాడలో అందుబాటులో ఉన్న సుమారు 85 ఎకరాల్లో 81 ఎకరాలను పేదల గృహ నిర్మాణ కార్యకలాపాల కోసం జీవీఎంసీకి అప్పగించారు. ఈ భూమికి కూడా విశ్వవిద్యాలయానికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు.

● 2001లో హనుమంతవాక జంక్షన్‌ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 9 ఎకరాల్లో 4 ఎకరాలను జాతీయ రహదారి సంస్థకు ఇచ్చారు. ఈ భూమికి కూడా ఏయూకు పరిహారం శూన్యం.

● 2018లో సుమారు 1.5 ఎకరాల విలువైన బీచ్‌ ప్రాంత భూమిని వాణిజ్య కార్యకలాపాల కోసం వుడాకు కేటాయించారు. ఇప్పటివరకు దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం అందలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

మరో కేటాయింపునకు రంగం సిద్ధం

ఇప్పటికే విలువైన భూములు కోల్పోయిన ఏయూకు మరోసారి భూ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యోగా సెంటర్‌ భూమిని ఆయుష్‌ ఆసుపత్రికి, సిరిపురం సమీపంలోని భూమిని, హనుమంతవాక జంక్షన్‌ వద్ద మరో ఎకరం భూమిని జీవీఎంసీకి అప్పగించేందుకు ఏయూ వైస్‌చాన్సలర్‌ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు అమలైతే విశ్వవిద్యాలయానికి మరింత విలువైన భూమి దూరమయ్యే అవకాశం ఉందని ఏయూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తున్నప్పటికీ.. అందుకు తగిన విధంగా ఏయూకు పరిహారం అందకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రూ.7 కోట్ల మున్సిపల్‌ పన్ను వివాదం

ఒకవైపు విలువైన భూములను జీవీఎంసీ ఉచితంగా తీసుకుంటుంటే, మరోవైపు అదే జీవీఎంసీకి ఏయూ నిధుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల ఆస్తి పన్ను చెల్లించడం వివాదాస్పదంగా మారింది. గతంలో పన్ను మినహాయింపు కోసం గవర్నర్‌కు లేఖలు రాసి ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రక్రియ కొలిక్కి రాకముందే హడావుడిగా రూ.7 కోట్లు చెల్లించడాన్ని అప్పటి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ధనుంజయరావు తీవ్రంగా వ్యతిరేకించారని, వర్సిటీ ప్రయోజనాలకు గండికొట్టే నిర్ణయాలను వ్యతిరేకించినందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

పరిరక్షించకపోతే భవిష్యత్తు శూన్యం

వర్సిటీ భూములు ఎవరి సొంత ఆస్తి కాదని, భవిష్యత్‌ తరాల విద్యార్థుల కోసమేనని అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ వేస్తూ భూములు కేటాయిస్తుంటే, ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన ఏయూ ఆస్తులను ఇష్టారాజ్యంగా పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రస్తుత బదలాయింపు ప్రతిపాదనలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement