దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ సమ్మెద రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి దర్జాగా అక్రమిస్తున్నారు. సుమారు 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను ఎటువంటి అనుమతుల పత్రాలు లేకుండానే సాగు చేస్తున్నారు. కొందరు బయట వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి దౌర్జన్యంగా దురాక్రమణకు తెగబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ముట్టడంతోనే అటుగా కన్నెత్తి చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమణలపై బాధిత రైతులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ఇదిలా ఉండగా సమ్మెద రెవెన్యూ పరిధిలో బంజరు భూములకు 2005లో అప్పటి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసింది. వీరిలో కొందరు సాగు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ ప్రాంతానికి సంబంధం లేని బయట వ్యక్తులు ఆక్రమించి దర్జాగా సాగు చేస్తున్నారు. భూ హక్కుదారులకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమణదారులకు కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిష్కరించకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, ప్రస్తుతం చేపడుతున్న రీసర్వేలో ఆక్రమణదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమణదారుల నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


