జీవీఎంసీకి మళ్లీ విలీన గండం! | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీకి మళ్లీ విలీన గండం!

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

ఎన్నికలు ఎగ్గొట్టేందుకే కూటమి సర్కారు కొత్త నాటకం?

79 గ్రామ పంచాయతీల విలీనం పేరిట గ్రామసభల హడావుడి

గతంలో ఎన్నికలు ఆపేసినట్లే.. మళ్లీ పాత ఫార్ములా అమలు?

అప్పుడూ బాబే.. ఇప్పుడూ బాబే..

డాబాగార్డెన్స్‌: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలను దీర్ఘకాలం పాటు వాయిదా వేసేందుకు కూటమి ప్రభుత్వం ’విలీన ప్రక్రియ’ పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చి, ఆపై న్యాయపరమైన వివాదాలు సృష్టించి ఏకంగా 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే, అదే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాసీ్త్రయ పద్ధతిలో 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, ఎన్నికలు జరపకూడదనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది.

రాత్రికి రాత్రే గ్రామసభల డ్రామా

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజాస్వామ్య నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటోంది. నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల విలీనం కోసం హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. కార్పొరేట్‌ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, కూటమి పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఈ రకమైన దారుణమైన చర్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు, విధులు, అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల ఆశయాలకు ఈ చర్య కోలుకోలేని దెబ్బ.

ఆలోచించే సమయం ఎక్కడ?

జీవీఎంసీలో విలీనం కావాలో వద్దో తేల్చుకునే కనీస స్వేచ్ఛను కూడా ప్రజలకు ఇవ్వడం లేదు. లాభనష్టాలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వకుండా, ఆఘమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ముందస్తుగా గడువు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తేదీలను వెల్లడించాలి. విలీనం వల్ల కలిగే పరిణామాలు, లాభాలు, నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ, కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులతో ముందస్తుగా విలీన లేఖలు రాయించి, గ్రామసభలలో తూతూమంత్రంగా ఆమోదం పొందేందుకు డ్రామా ఆడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత విలీన ప్రాంతాల పరిస్థితి ఏంటి?

గతంలో జీవీఎంసీలో విలీనం చేసిన గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 32 గ్రామ పంచాయతీల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. విలీనమైన ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా, ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది.

తాగేందుకు కనీస తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్య కార్మికులను కూడా పూర్తి స్థాయిలో నియమించలేకపోయారు. ’పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం’ పేరుతో ప్రజల ఉమ్మడి ఆస్తులను, మౌలిక సదుపాయాలను ప్రైవేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారు.

గ్రామీణ స్వరూపానికి ముప్పు

కూటమి ప్రభుత్వం జీవీఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలు నగరానికి అత్యంత సుదూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. విలీనం పూర్తయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిగా రద్దవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలపై పట్టణ స్థాయి ఆస్తి, చెత్త, నీటి పన్నుల భారం మోపబడుతుంది. స్థానిక పాలన ప్రజలకు దూరమై, వికాసానికి బదులు వినాశనం దాపురిస్తుంది.

పన్నులు నగర స్థాయిలో.. సేవలు?

గ్రామ పంచాయతీ నుంచి జీవీఎంసీలోకి వస్తే ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ఇతర పౌరసేవల రుసుములు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది. పన్నులు పెరిగితే అందుకు తగ్గట్టుగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలు అందుతాయా? అన్నది ప్రశ్న. ఇప్పటికే విలీనమైన ప్రాంతాల్లో మౌలిక వసతుల పరిస్థితిపై సమీక్ష చేయకుండా కొత్తగా మరో 79 గ్రామ పంచయాతీలను కలపడం వల్ల జీవీఎంసీపై మరింత భారం పడుతుందన్న విమర్శలూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement