స్లాస్‌ సర్వేలో పారదర్శకత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

స్లాస్‌ సర్వేలో పారదర్శకత పాటించాలి

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

కశింకోట : స్లాస్‌ (ఎస్‌ఎల్‌ఎఎస్‌) సర్వేను కేవలం ఒక పరీక్షగానే కాకుండా విద్యార్థుల వాస్తవ అభ్యసన స్థాయిని తెలుసుకునే ముఖ్య విద్యా సాధనంగా చూడాలని జిల్లా విద్యా శాఖ అధికారి జి.జి.ఈ నాగేశ్వరరావు సూచించారు. కశింకోటలోని డీపీఎన్‌ జెడ్పీ హైస్కూల్లో జోన్‌ స్థాయిలో 7 మండలాలకు చెందిన ఎంపిక చేసిన 139 మంది ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌కు మంగళవారం స్లాస్‌ సర్వే (రాష్ట్ర స్థాయి అభ్యాసన సాధన సర్వే)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తరగతి స్థాయికి అనుగుణంగా సాధించాల్సిన అభ్యాసన ఫలితాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోవడం, వారి సామర్థ్యం, అభ్యాసన లోపాలను గుర్తించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సర్వే ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన అబ్యాసన మెరుగుదల కార్యక్రమాలను రూపొందించేందుకు, బోధనా పద్దతులను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. ఫీల్డ్‌ ఇన్విజిలేటర్లు సర్వే సమయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి సమాధానాలను సూచించరాదని, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఒ వి. సురేష్‌, డిసీసీబీ కార్యదర్శి నూకరాజు, డైట్‌ లెక్చరర్‌ సిహెచ్‌. శ్రీధర్‌, ఎ.వి. రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వేతన బకాయిల కోసం డీఈవోకు వినతి

జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది చెందుతున్నామని, వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఒ జిజిఈ నాగేశ్వరరావును కోరారు. కశింకోటలోని డీపీఎన్‌ జెడ్పీ హైస్కూలుకు వచ్చిన సందర్భంగా మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్‌పీలు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జూన్‌, జులై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించలేదన్నారు. వేతనాలు సకాలంలో జమ అయ్యేలా చూడాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు అచ్యుతకృష్ణ, శంకర్‌, రమణ, నూకేష్‌, లక్ష్మణ్‌, సత్యబాబు, లక్ష్మినారాయణ, రామలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement