పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ● వంతెనలు లేక అవస్థలు
వంతెన నిర్మించాలి
మండలంలోని జామిగుడ, ఇంజరి పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంజివాడ, జామిగుడ గ్రామా ల మధ్య గెడ్డపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది నిర్మించారు. స్థల వివాదం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించి, నిలిపివేశారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలి.
– మజ్జి చంద్రుబాబు, వైఎస్సార్‌సీపీ పెదబయలుమండల అధ్యక్షుడు
పెదబయలు/ముంచంగిపుట్టు: జిల్లాలో పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
● పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలో జామిగుడ గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇంజరి పంచాయతీలో 10 గ్రామాలు, గిన్నెలకోట పంచాయతీలో 5 గ్రామాలు, గుల్లేలు పంచాయతీలో కించూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల జామిగుడలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి గెడ్డ అవతలి వైపు ఉన్న గుంజివాడ, తారాబు, చింతలవీధి, సరిగిగుడ, గబ్బరుమామిడి, కెందుగుడ ప్రజలతో పాటు మరో నాలుగు గ్రామాల ప్రజలు రాలేకపోయారు.
● ముంచంగిపుట్టు మండలంలో లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల్లో మారుమూల గ్రామాల్లో వాగులు పొంగాయి. వరదనీటితో గెడ్డలు ప్రమాదభరితంగా ఉన్నాయి. లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ ఉన్న వాగులు పొంగడంతో మూడు రోజులుగా రెండు గ్రామాల గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. దొడిపుట్టు పంచాయతీ బీడిచెంప గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకవరం, కర్రిముఖిపుట్టు, కిలగాడ, వనుగుమ్మ, బరడ పంచాయతీల్లో వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే మార్గంలో భారీగా గోతులు ఉండడంతో వాహనాలు గోతుల్లో దిగిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికుల సహాయంతో గోతుల నుంచి వాహనాలు అతికష్టం మీద బయటకు తీయవలసి వస్తోంది.
● జి.మాడుగుల మండలంలో కిల్లంకోట వద్ద చాపగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అసంపూర్తిగా జామిగుడ వంతెన
పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటుగా ఒడిశాకు అనుసంధానం చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది వరకు నిర్మించారు. అనంతరం స్థల వివా దం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు నిర్మించి, నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. గ్రామాల నుంచి పంచాయతీ కేంద్రానికి రావడానికి కూడా వీలులేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి గుంజివాడ, కించూరు, తారాబు గెడ్డలపై వంతెనలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.


