కోటవురట్ల: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని యండపల్లిలో అన్నవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బీహార్‌కు చెందిన మహ్మద్ సెహవాజ్, మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చింతపల్లి వచ్చారు. సోమవారం ఉదయం రేవు పోలవరం బీచ్‌కు ముగ్గురూ బైక్‌పై వెళుతుండగా అన్నవరం జంక్షన్ వద్ద మలుపులో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచీని వేగంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో బైక్ నడుపుతున్న మహ్మద్ సెహవాజ్(22) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్‌లకు గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


