రుచికరం.. విభిన్నం | - | Sakshi
Sakshi News home page

రుచికరం.. విభిన్నం

Aug 24 2026 12:19 AM | Updated on Aug 24 2026 12:19 AM

ఆరోగ్యానికి ఎంతో మేలు

సంతలో వెదురు కొమ్ములు అమ్మకాలు

ముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో లభించే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఎప్పుడైనా వెదురు నుంచి తీసిన కూరను రుచి చూశారా? వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ, గిరిజనులు మాత్రం లేత వెదురు చిగురుతో ఎంతో రుచికరమైన కూర వండుకుంటారు. దీనిని స్థానికంగా వెదురు కొమ్ములు లేదా వెదురు కంజి అని పిలుస్తారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో, మన్యం ప్రాంతాల్లోని మండల కేంద్రాలు వారపు సంతల్లో ఈ వెదురు కంజి అమ్మకాలు హాట్‌ కేకుల్లా సాగుతున్నాయి.

సేకరణ: అటవీ, కొండ ప్రాంతాల్లోని వెదురు బొంగుల నుంచి లేత వెదురు చిగురును సేకరించి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్‌ చేస్తారు. గిరిజనులు వీటిని మండల కేంద్రాలకు తెచ్చి, వాటాను బట్టి రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు.

రెండు రకాలు

● పచ్చి వెదురు కంజి.. సేకరించిన వెంటనే తాజాగా ఉన్నప్పుడు కూర వండుకోవడానికి ఉపయోగిస్తారు.

● ఎండబెట్టిన కంజి.. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకుని, ఏడాది పొడవునా ఎప్పుడైనా వండుకోవడానికి ఉపయోగిస్తారు.

రుచికరమైన వంటకాలు

ఈ వెదురు కంజిని మన్యం వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. దీనితో వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు.

చిట్కా: వెదురు కంజి కూర వండే ముందు, దానిలోని సహజమైన చేదుదనం పోయేలా రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగుతారు. అప్పుడే కూర అద్భుతమైన రుచిని ఇస్తుంది!

ఉపయోగాలిలా..

వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరిరానికి తక్షణమే వేడి చేస్తుందని గిరిజనులు చెబుతుంటారు. మదుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా ఎంతో ఉప శమనం ఇస్తుంది. రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. మహిళల్లో గర్భశోఖ వ్యాధులు రాకుండా అరికడుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. అలాగే గాయాలైనప్పుడు గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు. దీనికి తోడు మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా వినియోగిస్తామని గిరిజనులు తెలిపారు.

వెదురు కొమ్ములకు గిరాకీ

అటవీ ప్రాంతాల్లో వెదురు నుంచి లేత చిగురు సేకరణ

వారపు సంతల్లో అమ్మకాలు

వేపుడు, పచ్చడి, పులుసు రుచులకు ఎంతో డిమాండ్‌

గిరిజనులకు ఎంతో ఇష్టమైన వంటకం

వెదురు

కంజి

వెదురు కొమ్ములను గర్భిణులకు అధికంగా వండి పెడతాం.దీనిలో ఉన్న గుణాలు వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి వేడిచేసినా గిరిజన ప్రాంతంలోని వాతావరణం చల్లగా ఉన్నందున పెద్దగా ఇబ్బంది ఉండదు. వెదురు కొమ్ముల కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి.

– ఎస్‌.పుణ్యవతి, గృహిణి, డేగలపుట్టు,

ముంచంగిపుట్టు మండలం

వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు జోరు గా సాగుతున్నాయి. కొమ్ముల వాటా రూ.20, రూ.50కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగా, ఉడకబెట్టి మరీ అమ్ముతున్నాం. వారపు సంతలో కొమ్ములు తెచ్చిన కొద్దిసేపటికే అమ్ముడు పోయాయి.

– ఎస్‌.రామారావు, కూరగాయల వ్యాపారి,

నర్సిపుట్టు, ముంచంగిపుట్టు

మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement