ముంచంగిపుట్టు: మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహించింది. జర్రెల పంచాయతీ డేగలపుట్టు గ్రామానికి చెందిన గుంట గోపాల్ అనే గిరిజనుడి ఇంటిపై భారీ చింతచెట్టు, వెదురు చెట్లు ఒకేసారి పడటంతో పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల నేత నాయకం సురేష్ డేగలపుట్టు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్టంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించిన ఆయన, ప్రభుత్వాన్ని తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
తగ్గని వర్షం.. వారపు సంతలకు ఆటంకం
సీలేరు: ఏజెన్సీ, ఆంధ్రా–ఒడిశా–పోలవరం సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ, చిత్రకొండ ప్రాంతాల్లో జరిగిన వారపు సంతలు వర్షం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. గిరిజనులు తాము పండించిన కూరగాయలను విక్రయించడానికి తెచ్చినా, కొనుగోలుదారులు లేక, వర్షానికి కూరగాయలు తడిసిపోవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. పిల్లిగెడ్డ, కొంగపాకల, మాదిగమల్లు, చిన్న గంగవరం తదితర వాగులు కొండనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అసంపూర్తిగా నిలిచిన వంతెనల కారణంగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రమాదకరంగా మారాయి. మైదాన ప్రాంతాల్లో ఎండలు కాయగా, ఏజెన్సీలో మాత్రం నిత్యం కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్తంభించిన జనజీవనం


