అడవితల్లి బాట తప్పింది | - | Sakshi
Sakshi News home page

అడవితల్లి బాట తప్పింది

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

ఆర్భాటంగా బోర్డులు.. అంగుళం కదలని పనులు రహదారి లేక పీఎం జనమన్‌ ఇళ్ల సామగ్రి మోసుకెళ్తున్న గిరిజనం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ హడావుడికే పరిమితం

అడవితల్లి బాట బోర్డుకే పరిమితమైన

అమలగుడ రోడ్డు

డుంబ్రిగుడ: మండలంలోని రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కూటమి పాలనలో గిరిజన గ్రామాల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. మండలంలోని గసభ పంచాయతీ కుసుమకెంద, కండ్రుమ్‌ పంచాయతీ కుక్కుడబెడ్డ, పోతంగి పంచాయతీ అమలగుడ, తూటంగి పంచాయతీలోని జర్రాయి నుంచి బుడ్డింగి గ్రామానికి వెళ్లే రహదారులు ప్రస్తుతం పూర్తిగా అధ్వానంగా మారి చెరువులను తలపిస్తున్నాయి.

●తూటంగి పంచాయతీ బుడ్డింగి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అరకొరగా రూ. 1.50 లక్షలు మంజూరు చేసినా.. వాస్తవానికి నిధుల విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకుండానే ఉడాయించాడు. దీంతో విసుగు చెందిన గిరిజన గ్రామస్తులు.. ఊళ్లోకి కనీసం అత్యవసర పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలైనా వెళ్లేందుకు వీలుగా తమ సొంత ఖర్చులతో, శ్రమదానంతో ఒక చిన్న మట్టి దారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి దారి కూడా పూర్తిగా కొట్టుకుపోయి కొండవాగులా మారింది. ప్రస్తుతం ఆ గ్రామానికి బైక్‌పై కూడా వెళ్లలేని ఘోర దుస్థితి ఏర్పడిందని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు.

జన్‌మన్‌ ఇళ్లకు తప్పని తిప్పలు

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్‌మన్‌ పథకం కింద ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న గృహాలకు సైతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. ఇళ్లు మంజూరైనా.. వాటిని నిర్మించుకునేందుకు అవసరమైన ఇటుకలు, సిమెంట్‌, ఐరన్‌ వంటి సామగ్రిని గ్రామాల్లోకి తరలించేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తమ నెత్తిన, భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. నిత్యం కాలినడకన మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ గిరిజన మహిళలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఈ రోడ్లు ఎప్పటికి పూర్తవుతాయో.. కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాలు తమ గ్రామాలకు ఎప్పుడు వస్తాయో తెలియక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు అమలగుడలో రోడ్డుతో పాటు వంతెన అత్యవసరంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికై నా పాలకుల ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి, అధికారులు, కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని నిలిచిపోయిన రోడ్డు పనులను పునఃప్రారంభించాలని, త్వరితగతిన నిధులు విడుదల చేసి పనులు పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు.

బుడ్డింగి రహదారికి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. 1.50 లక్షలు. ఆ నిధులు కూడా విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు వదిలేసి ఉడాయించాడు. విసుగు చెంది గిరిజనులు తమ సొంత ఖర్చులతో, శ్రమదానంతో మట్టిదారి చేసుకుంటే.. ప్రస్తుత వర్షాలకు అది కొట్టుకుపోయి కొండవాగులా మారింది. కనీసం బైక్‌ కూడా వెళ్లలేని ఘోర దుస్థితిపై మన్యం కన్నీరుమున్నీరవుతోంది.

రెండు నెలల్లో రోడ్లు పూర్తి చేస్తామని పెద్దపాడులో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేసి ఏడాది దాటినా అతీగతీ లేదు. గసభ పంచాయతీ కుసుమకెంద రోడ్డును కేవలం మూడు కిలోమీటర్లు మట్టి పోసి గాలికొదిలేశారు. వర్షాలకు ఆ దారి కాస్తా బురదమయంగా మారి చెరువులను తలపిస్తోంది. అత్యవసర వైద్యానికి వెళ్లాలన్నా ఆటోలు కూడా రాని పరిస్థితి నెలకొంది.

అద్భుతంగా మార్చేయడం

అంటే ఇదేనా?

గత ఏడాది ఏప్రిల్‌లో గిరిజన ప్రాంతంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మన్యంలోని రోడ్లను అద్భుతంగా మార్చేస్తామంటూ ‘అడవితల్లి బాట’ అనే సరికొత్త ప్రచార అస్త్రాన్ని వదిలారు. ఇందులో భాగంగా మండలంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌, పంచాయతీ రాజ్‌, ఉపాధి హామీ ద్వారా సుమారు 15 రోడ్లు మంజూరైనట్లు నేతలు ఊదరగొట్టారు. పోతంగి పంచాయతీ అమలగుడ, కండ్రుమ్‌ పంచాయతీలోని కుక్కుడబెడ్డ, శిరసగుడ గ్రామాలకు రోడ్లు వేస్తున్నట్లు అట్టహాసంగా అడవితల్లి బాట బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ, బోర్డులు పెట్టి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు పడలేదు. బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా కేవలం ప్రచారం కోసమే బోర్డులు పెట్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రోడ్ల ముఖం చూడని గిరిజనులకు.. అధికార పార్టీ పాలకుల వైఫల్యానికి సాక్ష్యాలుగా ఆ ప్రభుత్వ బోర్డులు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. ఇక గసభ పంచాయతీ కుసుమకెంద రోడ్డును కేవలం మూడు కిలోమీటర్ల మేర మట్టి పోసి అలాగే వదిలేయడంతో వర్షానికి అదంతా బురదమయంగా మారింది.

‘కూటమి’ నిర్లక్ష్యానికి నిదర్శనం

గత ఏప్రిల్‌ నెలలో మండలంలోని పెద్దపాడు గ్రామాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ గిరిజన ప్రాంత రోడ్లకు శంకుస్థాపన చేశారు. రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఏడాది దాటినా పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం

– పాంగి పరశురామ్‌, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, డుంబ్రిగుడ

అస్తవ్యస్తంగా పనులు

స్వర్ణయిగుడ నుంచి కుక్కుడబెడ్డ వరకు రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. అడవితల్లి బాట పథకం కింద అధికారులు గత ఏడాది బోర్డులు మాత్రమే వేశారు కానీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగలేదు. వర్షాలు ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

– కొర్ర రాజారావు, స్వర్ణయిగుడ,

కండ్రుమ్‌ పంచాయతీ,

డుంబ్రిగుడ మండలం

Advertisement
 
Advertisement
Advertisement