భక్తజన సంద్రమైన శరభన్నపాలెం
కొయ్యూరు: కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయని ఇలవేల్పుగా పేరుగాంచిన యర్రగొండమ్మ తల్లి ఘటాల ఊరేగింపు గురువారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శరభన్నపాలెం నుంచి నడింపాలెం వరకు సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శక్తి వేషాలు : ఆలయ కమిటీ చైర్మన్ గొడ్డేటి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఊరేగింపులో కళాకారులు ప్రదర్శించిన శక్తి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. బట్టపనుకుల, వెలగలపాలెం, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
నాలుగు రోజుల పాటు ఉత్సవాలు: ఈ ఉత్సవాలను మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కె.శివప్రసాద్, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి సుమర్ల సాంబశివరావు, కిరణ్ మాస్టర్, మాజీ సర్పంచులు కిముడు సత్యనారాయణ, ధారకొండ నారాయణమూర్తి, మాజీ వైస్ సర్పంచ్ త్రిమూర్తులు, యెర్రేసు, రమాదేవి, సువర్ణరాజు పాల్గొన్నారు.


