కడుతులలో తీరని దాహం | - | Sakshi
Sakshi News home page

కడుతులలో తీరని దాహం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

సమస్య పరిష్కరించకుంటే

మండల పరిషత్‌ను ముట్టడిస్తాం

గిరిజన సంఘం హెచ్చరిక

ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తగదని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎం. శ్రీను, కె. నర్సయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని పనసపుట్టు పంచాయతీ, కడుతుల గ్రామంలో పర్యటించిన వారు, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడుతుల గ్రామంలో నీటి ఎద్దడికి ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపమే ప్రధాన కారణమని విమర్శించారు. గ్రామంలో లో–వోల్టేజీ సమస్యను పరిష్కరించకపోవడం, నీటి పథకం పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల నెలల తరబడి గిరిజనులు దాహార్తితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడైన నీటి పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నీటి సరఫరా కోసం గ్రామంలో స్థానికులతో కలిసి గిరిజన సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లోగా నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రామస్తులందరితో కలిసి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జమున, సోన్నాయి, మున్ని, తరుణ్‌, దేవదాసు, కొమ్ములు, త్రినాథ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement