● తహసీల్దార్‌కు భక్తుల విన్నపం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని రామాలయం చుట్టూ ఉన్న భూమి అక్రమణకు గురవుతోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్ చేశారు. బుధవారం వారంతా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ భాస్కర అప్పారావుకు ఫిర్యాదు చేశారు. రామాలయ నిర్మాణ సమయంలో కేటాయించిన 25 సెంట్ల భూమి క్రమంగా ఆక్రమణలకు గురవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం చుట్టూ వెలుస్తున్న అక్రమ నిర్మాణాల వల్ల ఆలయ ప్రాంగణం కుంచించుకుపోతోందని వివరించారు.ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆలయ భూమిని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు.భక్తుల ఫిర్యాదుపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. రామాలయ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని లేదా ఆలయ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


