సాక్షి, విశాఖపట్నం: అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో శాయశక్తులా కృషి చేస్తానని కలెక్టర్ టి. నిశాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె జిల్లా 4వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఘాట్‌రోడ్డులోని అమ్మవారి పాదాలు, పాడేరు పట్టణంలోని శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వేదమంత్రాల నడుమ తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టి, తొలి సంతకం చేశారు. ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, వివిధ శాఖల అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూలగుత్తులు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి జిల్లాకు కలెక్టర్‌గా రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుంటా. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహకరించాలని ఆమె కోరారు.


