పెదబయలులో రేషన్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పెదబయలులో రేషన్‌ కష్టాలు

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

పెదబయలు: స్థానిక డీఆర్‌ డిపో పరిధిలోని రేషన్‌ లబ్ధిదారులకు ప్రతి నెలా సరకులు తీసుకోవడం గగనంగా మారింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే డిపో వద్దకు చేరుకున్న లబ్ధిదారులు, 10.30 గంటల వరకు పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఎండలో తీవ్ర అవస్థలు పడ్డారు.

ఎమ్మెల్యే ఆగ్రహం చెందినా..అమలు కాని ఆదేశాలు

గతంలో పనిచేసిన కాంట్రాక్ట్‌ సేల్స్‌మన్‌ ఆనందరావు సుమారు 100 మంది లబ్ధిదారులకు రశీదులు ఇచ్చి, మూడు నెలల పాటు బియ్యం పంపిణీ చేయలేదు. ఈ విషయాన్ని లబ్ధిదారులు అరకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఈ నెల 2వ తేదీన ఆయన డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బకాయి ఉన్న రేషన్‌ను వెంటనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు కొంతమందికి పంపిణీ చేసినప్పటికీ, మిగిలిన వారికి ఇంకా అందాల్సి ఉంది.

బాధ్యతల మార్పు.. మారని తిప్పలు..

ఈ నెల నుంచి జీసీసీ గోడౌన్‌ ఇన్‌చార్జి సుబ్బారెడ్డికి డిపో విక్రయాల అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, బాధ్యతలు ఎవరికి అప్పగించినా తమకు సకాలంలో రేషన్‌ అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలి పనులకు వెళ్లే మేము, రేషన్‌ కోసం రోజంతా వేచి చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్‌ వచ్చేది, ఇప్పుడు డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది అని వారు వాపోయారు. స్థానిక రెవెన్యూ, జీసీసీ, సివిల్‌ సప్లై అధికారులు ఉన్నప్పటికీ తమ కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయంపై ఇన్‌చార్జి సేల్స్‌మన్‌ సుబ్బారెడ్డిని వివరణ కోరగా.. గ్యాస్‌ గోడౌన్‌ పనుల ఒత్తిడి కారణంగా డిపో తెరవడంలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ లోపు లబ్ధిదారులందరికీ ఇబ్బంది లేకుండా రేషన్‌ పంపిణీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

డీఆర్‌ డిపో ఎదుట లబ్ధిదారుల పడిగాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement