అరకు ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష సంపద
శాపంగా కార్చిచ్చులు, ఆక్రమణలు
పర్యావరణానికి పొంచి ఉన్న గండం
ఈ ప్రాంత జీవవైవిధ్యంపై శాస్త్రవేత్తల ఆందోళన
అడవుల సుస్థిర నిర్వహణతోనే వృక్షజాతుల పరిరక్షణ
అరకు అందం అంటే కేవలం కాఫీ తోటలు, మంచు తెరలే కాదు.. అంతకు మించిన అరుదైన జీవ సంపద అక్కడ కొలువై ఉంది. గిరిజన జీవనోపాధికి మూలమైన ఔషధ మొక్కలు, ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన వృక్ష జాతులకు అరకు నిలయం. కానీ, ప్రస్తుతం ఈ పర్యావరణ వ్యవస్థ వినాశనానికి చేరువలో ఉందని వృక్షశాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అరకులోయ టౌన్: ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అరకులోయ కేవలం పర్యాటక కేంద్రమే కాదు, అది అరుదైన జీవవైవిధ్యానికి అసలైన భాండాగారం.జిల్లాలోని అరకు, అనంతగిరి, సుంకరమెట్ట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో విస్తరించి ఉన్న కొండల శ్రేణి ఒక అద్భుత పర్యావరణ వ్యవస్థకు వేదిక. ముఖ్యంగా 1680 మీటర్ల ఎత్తుతో తూర్పు కనుమల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరంగా వెలుగొందుతున్న జిందాగడ్డ శిఖరం (సీతమ్మకొండ) ఈ ప్రాంతానికే మకుటాయమానం.
● అధిక వర్షపాతం, ఎత్తయిన కొండల కారణంగా ఇక్కడ దట్టమైన అర్ధ సతతహరిత, ఆకురాల్చే అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే, తరతరాల చరిత్ర కలిగిన ఈ అపురూప ప్రకృతి సంపద ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది.
● ఆంధ్రా యూనివర్సిటీ హెర్బేరియం, మ్యూజి యం వృక్షశాస్త్ర విభాగం క్యూరేటర్ డాక్టర్ జె.ప్రకాశరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక జాతుల మొక్కలు గిరిజన జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
జాతుల దురాక్రమణ
స్థానిక మొక్కల ఆవాసాలను ఆక్రమిస్తున్న విదేశీ మొక్కల వల్ల మన ప్రాంతీయ వృక్ష సంపద క్రమంగా అంతరించిపోతోంది. ఈ నేపథ్యంలో అరకులోయలోని ఈ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం కేవలం పర్యావరణానికే కాదు, స్థానిక గిరిజన తెగల ఆర్థిక స్థితిగతులకు కూడా ఎంతో అవసరం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు సమన్వయంతో అడవుల సంరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ అటవీ సంపదను కాపాడుకుంటేనే అరకు అందం, ఆయుష్షు పదికాలాల పాటు పచ్చగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి.
అటవీ సంరక్షణపై ప్రత్యేకదృష్టి
ఇక్కడి అడవుల్లో అంతరించిపోతున్న అరుదైన ఔషధ మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అరకులోయలోని సహజ వనరులను కాపాడుకుంటూనే, స్థానిక గిరిజనుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి అరకులోయ జీవవైవిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అడవుల సుస్థిర నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
–డాక్డర్ జె.ప్రకాశరావు, క్యూరేటర్, హెర్బేరియం, మ్యూజియం వృక్షశాస్త్ర విభాగం ఏయూ, విశాఖపట్నం
వినాశనానికి చేరువలో..
ఇంతటి గొప్ప వృక్ష సంపద ప్రస్తుతం వినాశనానికి చేరువలో ఉందని డాక్టర్ జె. ప్రకాశరావు, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్త డాక్టర్ కేవీ సతీష్ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలు ఇవేనని వారు పేర్కొన్నారు.
అటవీ నిర్మూలన..
కలప కోసం, సాగు భూమి విస్తరణ కోసం అడవులను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు.
మానవ జనిత ముప్పు
అడవుల ఆక్రమణలు, అడపాదడపా సంభవిస్తున్న కార్చిచ్చులు అరుదైన వృక్ష జాతులను దహించి వేస్తున్నాయి.
సహజసిద్ధంగా ఔషధ సంపద..
ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ప్రీమియం కాఫీ, నల్ల మిరియాలతో పాటు.. నల్లమద్ది, తెల్లమద్ది, సిరిమాను, ఉసిరి, పాతాళగరిడి వంటి విలువైన కలప, ఔషధ మొక్కలు ఇక్కడ సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి.
అరుదైన జాతులకు నిలయం
ఆర్జీరియా అరకుయోన్సిస్, ఎమిలియా రెడ్డి, ఫిలంతస్ నారాయణ స్వామి, కలాంచో చెరుకొండెంసిస్ వంటి అంతరించిపోతున్న అరుదైన మొక్కలకు అరకు పరిసరాలు నిలయం.
ప్రకృతి సిద్ధ ఆహారం..
గిరిజనులు ఎంతో ఇష్టంగా భుజించే ’బొడ్డెంగిలు’ (వన్య ఆహారం) అందించే ఫీనిక్స్ లౌరీరి (చిట్టెత) చెట్లు ఇక్కడ సమృద్ధిగా పెరుగుతాయి.


