వేరుశనగ రైతులకు వ్యవసాయశాఖ ఏడీ తిరుమలరావు సూచన
చింతపల్లి: గిరిజన రైతులు వేరుశెనగ పంటలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీవీ తిరుమలరావు అన్నారు. మంగళవారం చౌడుపల్లి పంచాయతీ పశువులుబందలో సాగుచేస్తున్న వేరుశనగ పైరును ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉన్నందున రైతులు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ గిరి రైతులు రబీ పంటగానే కాకుండా ఖరీఫ్‌లో కూడా సాగుచేయాలన్నారు.రాబోయే ఖరీఫ్ పంటకు చింతపల్లి సబ్ డివిజన్ పరిదిలో రెండు వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి.మధుసూదనరావు, హార్టికల్చర్ అసిస్టెంట్ వి.శోభన్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.


