అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను పరిష్కరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ, అనంతగిరి ఎంపీపీ తడబారికి మిధుల నివాసంలో పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మండలంలోని పలు ప్రజా సమస్యలను ఎంపీపీ మిధుల ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు బాటలు వేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆహ్వానం మేరకు మండలంలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఎంపీ తనూజా రాణి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి దేవి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శెట్టి వినయ్, ఎంపీటీసీలు జయశ్రీ, అరుణ, శ్రావణి, మాజీ ఎంపీపీ రమణమ్మ, మాజీ సర్పంచ్‌లు మజ్జి అప్పారావు, పొట్టమ్మ, రమేష్, పార్టీ నాయకులు కిరణ్, దోనేరు, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి


