చింతపల్లి: మేజర్ పంచాయతీ చింతపల్లిలో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. మంగళవారం పట్టణంలో చేపడుతున్న పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి ముత్యాలమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో చింతపల్లిలో మెయిన్‌రోడ్డుతో పాటు అన్ని పురవీధుల్లో పారిశుధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా 30మందితో గ్రామంలో చెత్తను తొలగించడంతోపాటు డ్రైనేజీల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యదర్శి ముక్కలి వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ అంబేద్కర్ సిబ్బంది పాల్గొన్నారు.


