నిత్యం 30–40 కంటెయినర్లలో తరలింపు
విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా పశు మాఫియా ఆగడాలు
సమాచారం అందడంతో వేంపాడు వద్ద పట్టుకున్న పోలీసులు
నక్కపల్లి : కంటైనర్‌లలో పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందడంతో వేంపాడు టోల్‌గేట్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా మానాపురం నుంచి విజయవాడ సమీపంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్దకు కంటైనర్‌లో రెండు అరలను ఏర్పాటు చేసి 48 ఎద్దులను ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటైనర్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తవలసలో ఉన్న గోశాలకు తరలించినట్టు సీఐ జె.మురళి తెలిపారు. కాగా ఇదేవిధంగా నిత్యం 30 నుంచి 40 కంటైనర్లలో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా పోలీసుల కంట పడడం లేదు. పోలీసుల కళ్లు కప్పడానికి లారీలు, వ్యాన్‌లు బదులుగా పశువుల రవాణాకు కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా ఈ పశురవాణా ఏళ్ల తరబడి జరుగుతోంది. కంటైనర్‌లో 40 నుంచి 50 గోవులను కుక్కి ఊపిరి ఆడకుండా చేసి వందల కిలోమీటర్ల దూరం మేత గాని, తాగడానికి నీళ్లు గాని ఇవ్వకుండా హింసిస్తూ కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని పశువులు మృత్యువాత కూడా పడుతున్నాయి.
అధికార పార్టీ నేతలు, వారి పీఏల కనుసన్నల్లో...
ఈ పశువులను రవాణా చేసే వ్యక్తి అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, వారి వద్ద పనిచేసే పీఏలను, అనుచరులను గుప్పెట్లో పెట్టుకుని నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ కంటైనర్లను పట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పశు మాఫియాలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఒక వర్గానికి చెందిన కంటైనర్‌లను మరో వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవహారంలో కీలక శాఖ మంత్రి వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో కొద్దిరోజుల పాటు పశురవాణా నిలిచిపోయింది. తాజాగా మళ్లీ పశు రవాణా ప్రారంభమైంది.
తప్పుడు సర్టిఫికెట్లతో...
ఈ అక్రమ రవాణాలో పశుసంవర్ధక శాఖ ప్రమేయంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల మాఫియా వద్ద కూలీలుగా పనిచేసే వారి ఆధార్ కార్డులను ఉపయోగించి వారే రైతులు, వారే కూలీలు, కొనేది వారే, అమ్మేది వారే అన్నట్టు సర్టిఫికెట్‌లు సంపాదించి పశువులను మేపుకొనేందుకే తరలిస్తున్నట్టు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. వాటిని చూపించి అక్రమంగా రవాణా చేస్తూ కబేళాకు తరలిస్తున్నారు.


