కశింకోట: జిల్లా స్థాయి పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్‌పో ప్రాజెక్టుల పోటీలో అచ్యుతాపురం మండలం హరిపాలెం హైస్కూలు విద్యార్థుల ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. దీనిలో ఎస్.రాయవరం మండలం గుడివాడ హైస్కూలుకి విద్యార్థుల ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తయారు చేసిన పది వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి ఆహూతులను ఆశ్చర్యచకితులను చేశారు. పర్యావరణం పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో సామాజిక సమస్యల పరిష్కారానికి అనువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. జిల్లా మేనేజర్ నారాయణరావు, పాఠశాల హెచ్‌ఎం ఎన్.వి.జె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


