తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఈ వారం కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. ప్రధానంగా భూ సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో విజయ కృష్ణన్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్‌ఎస్– 131, రెవెన్యూ క్లినిక్– 150 అర్జీలు మొత్తం 281 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్‌ఎస్, ఎన్‌ఏవోబీ, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్. సుబ్బలక్ష్మి, మనోరమ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, సీపీవో జి.రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డిగ్రీ చదువులకు సంకటం
పరవాడలో డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు నక్కపల్లి డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఏఐఎస్‌ఎఫ్ ఆద్వర్యంలో ఇక్కడ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్ర కుమార్ మాట్లాడుతూ పరవాడలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ, అక్కడి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. పరిశ్రమలకు పెద్ద ఎత్తున స్థలాల కేటాయించి శంకుస్థాపనలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవాలంటే అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా విద్యార్థినుల విషయంలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పంపడానికి తల్లిదండ్రులు భయపడటం వల్ల, అనేకమంది విద్యార్థినులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల మంజూరై ఐదేళ్లవుతున్నా ఇప్పటివరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించడం శోచనీయమన్నారు.
ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి
మాకవరపాలెం: మండలంలోని మామిడిపాలెం పంచాయతీలో ఉపాధి పనులు చేపట్టాలని సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. గ్రామంలో గత ఏడాదిగా పనులు చేయడం లేదని వాపోయారు. పంచాయతీ పరిధిలోని మామిడిపాలెం, అడిగర్లపాలెం, పోతలూరులో ఉపాధి వేతనదారులు పనులు లేక ఖాళీగా ఉంటున్నామన్నారు. వీఆర్పీని నియమించలేదన్నారు. 120 మందికి ఒక మేట్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి మేట్‌ల సంఖ్యను పెంచడంతోపాటు ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినట్టు మాజీ సర్పంచ్ బుడ్డా రమణ తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో కాలువలను పూడ్చవద్దని నిరసన
అనకాపల్లి –అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సాగునీటి కాలువలను పూడ్చివేసి వందల ఎకరాల భూములను బీడుగా మార్చవద్దని కోరుతూ మునగపాక, తోటాడ, నాగులాపలి, ఓంపోలు, తోటాడ, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, తదితర గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కాలువలను రోడ్డు విస్తరణలో కలిపేస్తున్నప్పటికి సాగునీటి కాలువకు అదనపు భూ సేకరణ చేపట్టకపోవడం సరికాదన్నారు. కాలువలు నిర్మాణం చేపట్టకపోతే పంటల సాగు పూర్తిగా నిలిచిపోతుందని, వ్యవసాయ భూములు కొర్నుగా మిగిలిపోతాయని, రైతులు వ్యవసాయాన్ని వదిలి పరిశ్రమలకు కూలీలుగా పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయన్నారు. రోడ్డు విస్తరణపై సమగ్ర విచారణ జరిపించి, కొత్త కాలువలు నిర్మించుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఉన్న కాలువలు ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.


