డుంబ్రిగుడ: ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు, మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ గ్రామంలో ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో సుమారు 82 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రజల వివరాలను సేకరించారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ.. మహిళల భద్రత, గంజాయి సాగు–నివారణ, రోడ్డు ప్రమాదాల అదుపు, ఆన్‌లైన్ మోసాలు, నాటుసారా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు చేసినా లేదా రవాణా చేసినా కఠిన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.


