అనకాపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనకాపల్లి నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖపట్నంకు చెందిన ‘సిరి డ్యాన్స్ అకాడమీ’ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్య గురువు స్వర్ణ టీచర్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నాట్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
శాసీ్త్రయ నృత్య రీతులతో
అలరించిన చిన్నారులు
కూచిపూడి నృత్యంలోని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనలు అత్యంత నిష్ణాతులైన కళాకారులను తలపించాయి. సంప్రదాయబద్ధమైన వేషధారణతో, ముఖంలో నవరసాలను పలికిస్తూ వారు చేసిన అభినయం చూపరులను కట్టిపడేసింది. గణపతి ప్రార్థనతో మొదలైన ఈ నృత్యోత్సవం, అమ్మవారి స్తోత్రాలు, తరంగం వంటి క్లిష్టమైన నృత్య రీతులతో కొనసాగింది. చిన్నారులు లయబద్ధమైన పాదముద్రలతో, చేతి ముద్రలతో కూచిపూడి సొగసును వేదికపై ఆవిష్కరించారు.
అభినందనల జల్లు
ఆ బాల కళాకారుల కళ్లలోని మెరుపు, దేహ కదలికల్లోని నృత్య సౌరభం అమ్మవారి సన్నిధిలో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాయని అతిథులు అభినందించారు. అకాడమీ వ్యవస్థాపకురాలు స్వర్ణ టీచర్‌ను, ఆమె శిష్య బృందాన్ని ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రముఖ గాయకులు మల్లికార్జున, గోపిక పూర్ణిమ కూడా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


