నర్సీపట్నం : పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దామని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆఖరి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో పాలకవర్గ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ సిబ్బంది అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. పాలకవర్గాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ మరో మూడేళ్లు అధికారంలో ఉంటా..నర్సీపట్నంను అభివృద్ధి చేయడమే తన ఏకై క లక్ష్యమన్నారు. మున్సిపాలిటీని రూ.21 కోట్లతో అభివృద్ధి చేశాను.. వచ్చే నెలలో మరో రూ.10 కోట్లు తెస్తున్నానన్నారు. రానున్న కాలంలో మరో రూ.20 కోట్లు తీసుకువస్తానన్నారు. తాను స్పీకర్ హోదాలో ఉండడం వల్ల కాదనకుండా మంత్రులు నిధులు ఇస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేశామన్న సంతృప్తి రాజకీయ నాయకుల్లో ఉండాలన్నారు. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. పార్టీలు వేరైనా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తనను ఎంతో గౌరవంగా చూసేవారన్నారు. కేరళ త్రివేండ్రంలో మాదిరిగా శివపార్వతుల 108 అడుగుల విగ్రహాన్ని నర్సీపట్నం పెద్దచెరువు మధ్యలో ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.7 కోట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో సభ్యులంతా భాగస్వాములు కావాలన్నారు. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, జగదీశ్వరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సహకారంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి కోట్ల రూపాయాలు తీసుకువచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం తమకు వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే చొరవతో గడపగడప కార్యక్రమంలో ప్రత్యేక గ్రాంటు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. రెండు ప్రభుత్వాల్లో ఈ పాలకవర్గం పని చేయడం గొప్ప అదృష్టమన్నారు. మునుముందు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, ధనిమిరెడ్డి మధు, మాజీ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి మాట్లాడారు. ప్రథమ శ్రేణి మున్సిపాలిటీ కావడం వల్ల ప్రత్యేక నిధులు వస్తాయని కౌన్సిలర్ పద్మావతి పేర్కొన్నారు. మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని మాజీ చైర్‌పర్సన్ కోరారు. జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య మాట్లాడుతూ మా వార్డుపై ప్రత్యేక దృష్టిసారించాలని, అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో గ్రూపు ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


