ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ బడ్జెట్‌! | - | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ బడ్జెట్‌!

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ బడ్జెట్‌!

ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ బడ్జెట్‌!

మేయర్‌ కాలానికి మోగిన ముగింపు గంట

మేయర్‌ కాలానికి మోగిన ముగింపు గంట
నేడు 2026–27 జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం మరో నెలన్నరలో పాలకవర్గానికి తెర

డాబాగార్డెన్స్‌(విశాఖ) : జీవీఎంసీ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నగర పాలకవర్గం కాలపరిమితి ముగియడానికి మరో నెలన్నర రోజులే గడువు ఉండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నగర ప్రజల్లో భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 18వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం అధికారికంగా ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేయర్‌ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌, ఆయన పదవీ కాలంలో మొదటిది, చివరిది కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం మార్చి 7వ తేదీ తర్వాత ఎటువంటి కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి పెండింగ్‌ పనులను చక్కబెట్టే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.

మళ్లీ చంద్రకాలమేనా?

నగర చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 27 నుంచి సుమారు ఎనిమిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రేటర్‌ విశాఖకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్‌ సీపీ ఘనవిజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, గతంలో లాగే మళ్లీ అధికారుల పాలన మొదలవుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పాలకవర్గ పదవీకాలం ముగియగానే సహజంగానే అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇదే తరుణంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. తన నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాఫీగా రాకపోకలు సాగడానికి, భీమిలి పరిధిలో ప్రతిపాదించిన ఏడు కీలక మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణానికి ఈ విలీనం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను చేపడితే, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు కాబట్టి, మరోసారి సుదీర్ఘకాలం పాటు నగర పాలన అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది.

విద్యారంగంపై నిర్లక్ష్యం

గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. బాల్యం పథకం కింద 3 నుంచి 7 ఏళ్లలోపు బాలలకు చిన్నబడి కార్యక్రమం కింద అంగన్‌వాడీ కేంద్రాలతో మున్సిపల్‌ పాఠశాలలను అనుసంధానం చేసి పౌష్టికాహారం, విద్య, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో విద్యకు కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా అన్ని రంగాలను ఈ బడ్జెట్‌ విస్మరిస్తూ నిధులు కేటాయించింది.

గత బడ్జెట్‌ అలా.. నేటి బడ్జెట్‌ ఇలా..

నగర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే బడ్జెట్‌ గణాంకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రారంభ నిల్వ రూ.482.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుత 2026–27 బడ్జెట్‌లో అది రూ.365.96 కోట్లకు పడిపోయింది. అంటే ప్రారంభ నిల్వలోనే సుమారు రూ.116.3 కోట్ల మేర కోత పడింది. గతేడాది అన్ని పద్దుల కింద మొత్తం ఆదాయం రూ.4,761.87 కోట్లుగా చూపగా, ఈ ఏడాది అది రూ.4,180.37 కోట్లకు పరిమితమైంది. అంటే ఆదాయం పరంగా చూస్తే ఈ ఏడాది ఏకంగా రూ.370 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముగింపు నిల్వలో సైతం రూ.27 కోట్ల మేర తేడా ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement