నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
దేవరాపల్లి: కార్మికులకు నష్టం కల్గించేలా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు, దేవరాపల్లి పీహెచ్‌సీ ముందు ఆశా కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కా ర్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చి అమలుకు పూనుకుందన్నారు. ఇది ముమ్మాటికి కార్మికులను కట్టు బానిసలుగా చేయడమేనన్నారు. కార్మికులకు వీటితో ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆశా కార్యకర్తలు పీహెచ్‌సీ వైద్యాధికారికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న, మండల నాయుకుడు బిటి. దొర, ఇందిర, జ్యోతి, వరలక్ష్మీ తదితర్లు పాల్గొన్నారు.
కశింకోట: కేంద్ర బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు నిధుల కేటాయింపు, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి కాసులమ్మ మాట్లాడుతూ 2026–27 సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో దేశంలో ఉన్న 26 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులతోపాటు దాదాపు కోటి మంది వర్కర్ల దుర్భర పరిస్థితి, హక్కులపై ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. స్కీం వర్కర్లకు సామాజిక భద్రత, పింఛన్ లేదని, అంగన్‌వాడీ కార్యకర్తలు,సహాయకులకు గాట్యూటీ మంజూరు చేస్తూ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు.అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు తనూజ, విజయ, రామలక్ష్మి, గంగ, సీఐటీయూ అనకాపల్లి మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి


