‘విద్యార్థిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలి’
అనకాపల్లి: బుచ్చెయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామానికి చెందిన, విజయవాడ దగ్గర పోరంకి చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పవన్ కుమార్‌ను హత్యచేసిన సీనియర్ విద్యార్థులను అరెస్టు చేయాలని, ఈ సంఘటను ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని జిల్లా యాదవ సక్షేమ సంఘం అధ్యక్షుడు భరణికాన బాబూరావు అన్నారు. విద్యార్థి మృతికి నిరసనగా పట్టణంలోని రింగ్‌రోడ్డు వద్ద గల చైతన్య కళాశాల వద్ద మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, సాక్ష్యాధారాలను మాయంచేయడానికి ప్రయత్నించిన కళాశాల యాజమాన్యంపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు కుటుంబానికి కశాశాల యాజమాన్యం నష్టపరింగా రూ.కోటి అందజేయాలన్నారు. సీపీఐ మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులతో పాటు అన్నివర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు, చోడవరం నియోజకవర్గం అధ్యక్షుడు మొల్లి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటరమణ, యాదవ సంఘం నాయుకులు కోనా గురయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ, కార్యదర్శి పి.విజయ్, సహాయకార్యదర్శి కృపానం, ప్రజా సంఘాల నాయకులు భర్నికాన నరసింహమూర్తి, పంచదార్ల సూరిబాబు, మొల్లి ప్రసాద్, మొల్లి సన్నిబాబు, గోకివాడ కోటేశ్వరరావు, వియ్యపు సింహాచలం, పల్లా సతీష్, కారుకొండ కన్నా, మొల్లి నాగు, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.


