వణికిస్తున్న చలి..
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో మరింతగా పడిపోయాయి. సాయంత్రమైతే జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం జి.మాడుగులలో 12.0 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో పెదబయలులో 13.8 డిగ్రీలు, అరుకులోయ, డుంబ్రిగుడలలో 14.1 డిగ్రీలు, పాడేరులో 14.9 డిగ్రీలు, చింతపల్లిలో 15.0 డిగ్రీలు, హుకుంపేటలో 15.2 డిగ్రీలు, కొయ్యూరులో 18.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంపచోడవరం డివిజన్‌లో మారెడిమిల్లిలో 16.0, వై.రామవరంలో 16.5, రంపచోడవరంలో 18.9, రాజవొమ్మంగిలో 19.8, అడ్డతీగలలో 20.6 డిగ్రీలు నమోదు కాగా, చింతూరు డివిజన్‌లో చింతూరులో 19.3 డిగ్రీలు, ఎటపాకలో 19.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9గంటలు దాటే వరకూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.


