ప్రభుత్వ పథకాలపై ట్రైనీ ఐఏఎస్‌ల అధ్యయనం
వై.రామవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎంత మేరకు ప్రజలకు అందుతున్నాయనే అంశంపై 12 మంది ట్రైనీ ఐఏఎస్‌లు అధ్యయనం చేశారు. మండలంలోని వై.రామవరం,యార్లగడ్డ, దాలిపాడు గ్రామాల్లో సోమవారం కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. మొదట స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల మండలస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో కె.బాపన్నదొర, తహసీల్దార్ పి.వేణుగోపాల్‌ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ముర్ల జోగిరెడ్డి, వలాల విశ్వమ్మ, ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి, మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధి, సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని వై.రామవరం, దాలిపాడు, యార్లగడ్డ సచివాలయాలను సందర్శించారు. వారం రోజుల పాటు మండలంలోని పలు గ్రామాలను పరిశీలించనున్నట్టు వారు చెప్పారు. ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటనకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


