కోతల వేళ.. వాన గండం
సాక్షి,పాడేరు:
ఆకాశం మేఘావృతమై వర్షసూచన కనిపించడం అన్నదాతలకు దడపుట్టిస్తోంది. అత్యధిక పంటలు కోతకు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు కోసి, నూర్పులు ప్రారంభించారు. ఈ దశలో జిల్లాలో మారిన వాతావరణం గిరిజన రైతులను భయపెడుతోంది. ఇటీవల మోంథా తుఫాన్ ప్రభావంతో వందలాది ఎకరాల్లో ఖరీఫ్ వరి, ఇతర చిరుధాన్యాల పంటలకు ఏర్పడిన నష్టం నుంచి తేరుకోక ముందే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయంటూ వార్తలు రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా వ్యాప్తంగా ఆకాశం నిండా మబ్బులు కమ్ముకోవడంతో భారీ వర్షాల భయం రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం వరి, రాగులు, ఇతర చిరుధాన్యాల పంటలు కోతదశలో కళకళాడుతున్నాయి. మోంథా తుఫాన్ తరువాత వాతావరణం బాగుండడంతో రైతులు పంట కోతలకు శ్రీకారం చుట్టారు. కోతలు హుషారుగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు గిరిజన రైతులను కలవరపెడుతున్నాయి.
పంటలను కాపాడుకునే ప్రయత్నంలో..
గిరిజన రైతులంతా తమ పంటలను కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలు కురుస్తాయనే భయంతో కాస్తోకూస్తో ఆదాయం ఉన్న గిరిజన రైతులు యంత్రాలతో ధాన్యం నూర్చి, ఇళ్లకు తరలిస్తున్నారు. అయితే 80 శాతం మంది రైతులు పేదవర్గానికి చెందిన వారే కావడంతో వారంతా సంప్రదాయంగానే నూర్పులు జరుపుతారు. కోతలు పూర్తయిన తరువాత తేమ ఆరేంతవరకు వరి పనలను పంట భూముల్లోనే ఉంచుతారు. అనంతరం వాటిని కుప్పలుగా పెట్టి నూర్పులు చేస్తారు. మూడు రోజులుగా కోసిన వరి పనలన్నీ పంట భూముల్లోనే ఉన్నాయి. వర్షాలు కురిస్తే అవన్నీ తడిసి ముద్దయ్యేప్రమాదముంది. దీంతో వరి పనలను కాపాడుకునే ప్రయత్నంలో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరి కుప్పలు వేసుకునేంత వరకు వర్షాలు కురవకూడదని గిరిజన రైతులు వరుణ దేవుడిని వేడుకుంటున్నారు. మరో వైపు 17 వేల హెక్టార్లలో సాగు చేసిన రాగులు, 5 వేల హెక్టార్లలోని చిరుధాన్యాల పంటలు కూడా కోతదశలోనే ఉన్నాయి. వర్షాలు కురిస్తే పంటలు నేలవాలి నష్టం భారీగా జరుగుతుంది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. మరో వైపు ఉష్ణోగ్రతలు తగ్గుమఖం పడుతుండడంతో వాతావరణ మార్పులు సహజం.
– డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్
చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం
యంత్రాలతో నూర్పులు
వర్షాలు కురుస్తాయనే భయంతో యంత్రాలతో ధాన్యం నూర్పులు చేపడుతున్నాం. గంటకు రూ.1,800 అద్దె తీసుకుంటున్నారు.అప్పు చేసి ధాన్యం నూర్పుల యంత్రాల తీసుకొస్తున్నాం.
– పాంగి సూరిబాబు, గిరిజన రైతు, కొంతిలి, హుకుంపేట మండలం
కోతల వేళ.. వాన గండం
కోతల వేళ.. వాన గండం
కోతల వేళ.. వాన గండం


