జనవరిలో అరకు చలి ఉత్సవాలు
మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయలో వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో అరకు చలి ఉత్సవాలు ఉండవచ్చని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అరకు చలి ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా అరకు చలి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. మారథాన్ రన్‌తో మొదటి రోజు అరకు చలి ఉత్సవాలను ప్రారంభిస్తామని, స్టాళ్ల ప్రారంభోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జూనియర్, సీనియర్ విభాగాల్లో చిత్రలేఖన పోటీలు జరుగుతాయన్నారు. రెండవ రోజు సైక్లింగ్, లేజర్ షో, ఫైర్‌షోతో పాటు ప్రధాన ఆకర్షణగా ఉండే గిరిజన సంప్రదాయాన్ని ప్రతిబింబించే కార్నివాల్ నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశ నలుమూలల నుంచి కళాకారులను ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల తరఫున స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సైక్లింగ్ కోసం గ్రామీణ రహదారిని కలుపుతూ పర్యాటక గమ్యస్థానాలు ఉండేలా చూడాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యాటకులు, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆహార స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లా పర్యాటక అధికారి దాసు, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


