
అయోమయం
సార్వత్రిక ఎన్నికల ముందు ఆచరణసాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలులో ప్రజలను నిలువునా మోసం చేస్తూనే ఉంది. అధికారంలోకి రాగానే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఆ ఊసెత్తలేదు. వచ్చేనెల 15 నుంచి పథకాన్ని అమలుజేస్తామని తాజాగా ప్రకటించి మహిళల్లో ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో పథకం అమలుపై అధికారులు, మహిళల్లో గందరగోళం నెలకొంది.
ఉచిత బస్సు ప్రయాణం..
నియమ నిబంధనలపై కొరవడిన స్పష్టత
● ఆగస్టు 15 నుంచి అమలు
చేస్తామన్న కూటమి ప్రభుత్వం
● ఇప్పటికీ ఖరారుకాని
విధి విధానాలు
● జిల్లాలో అరకొరగా ఆర్టీసీ బస్సులు
● 3.38 లక్షల మంది మహిళలు
● 60 సర్వీసులు మాత్రమే..
● అమలులో సందిగ్ధం
● గందరగోళంలో యంత్రాంగం
సాక్షి,పాడేరు: విస్తీర్ణంలో జిల్లా పెద్దదైనప్పటికీ అతితక్కువ సంఖ్యలో గల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు ఆర్టీసీకి కత్తిమీద సాములా మారనుంది. పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు 22 మండలాల పరిధి 430 పంచాయతీల్లో సుమారు 3.8 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో కనీసం లక్షమంది రోజువారీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఇంతమందికి అవసరమైన ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు.
● జిల్లాలో పాడేరులో మాత్రమే ఆర్టీసీ డిపో ఉంది. ఇక్కడ 47 బస్సులు ఉండగా వీటిలో 3 ఆల్ట్రా డీలక్స్, 12 ఎక్స్‌ప్రెస్, 32 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. మైదాన ప్రాంతాలైన అనకాపల్లి డిపో పరిధిలో రెండు, ఎస్.కోట పరిధిలో 3, నర్సీపట్నం పరిధిలో ఐదు, ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని తుని డిపో నుంచి 2,గోకవరం నుంచి 5,ఏలేశ్వరం నుంచి 5 పల్లెవెలుగు బస్సులో జిల్లాలో సేవలందిస్తున్నాయి.
● మహిళల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు లేవు. పాడేరు నుంచి దూరంగా ఉన్న చింతూరు డివిజన్‌కు, డొంకరాయికి, నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరానికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈరూట్లలో పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం లేనట్టేనని ప్రచారం జరుగుతోంది.
● పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టమైన విధి విధానాలు లేవు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుందా.. కొత్త జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది ఆర్టీసీ అధికారులు చెప్పలేకపోతున్నారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు చెందిన మహిళల్లో ఎక్కువ మంది ఉమ్మడి విశాఖ జిల్లాలోను, రంపచోడవరం నియోజకవర్గంలోని మహిళలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పథకం అమలుకాకుంటే తమకు పెద్దగా ఉపయోగకరం కాదని వారు వాపోతున్నారు. అలాగే మహిళా రైతులు కూడా తమ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు.
రోజుకు రూ.2 లక్షల నష్టం!
అంతంతమాత్రంగా ఆదాయం ఉండే జిల్లా కేంద్రం పాడేరు ఆర్టీసీ డిపో ఆర్థిక పరిస్థితిపై మహిళల ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ డిపో పరిధిలోని 32 పల్లెవెలుగు బస్సుల ద్వారా ప్రతి రోజు రూ.4లక్షల వరకు ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైతే పాడేరు డిపో కనీసం రూ.2లక్షల వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గోకవరం, ఏలేశ్వరం, నర్సీపట్నం, ఎస్.కోట, అనకాపల్లి, తుని ఆర్టీసీ డిపోలది ఆదాయ పరంగా ఇదే పరిస్థితి.
రోడ్డు, బస్సు సౌకర్యం లేని గ్రామాలు 2వేలు

అయోమయం