బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

బరితెగింపు

Aug 2 2025 6:26 AM | Updated on Aug 2 2025 6:26 AM

బరితె

బరితెగింపు

ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో దుండగులు పేట్రేగిపోతున్నారు. ఇంటి వద్ద ఉన్న బైక్‌లను అపహరిస్తున్నారు. దారికాసి తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీలకు పాల్పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని చెలరేగిపోతున్నారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామసచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సరిహద్దు గ్రామాల గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పేట్రేగిపోతున్న దుండగులు

2024 ఆగస్టు 23న ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రెయ్యిల పురుషోత్తంను కత్తులు, తుపాకులతో బెదిరించి బైక్‌ పట్టుకుపోయారు. వనగుమ్మి సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అతను ఇంటికి వెళ్తుండగా బరడ పంచాయతీ డెనుజోలా ఘాట్‌లో మాస్క్‌లు ధరించిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు.

2024 మార్చి 11 అర్ధరాత్రి ముంచంగిపుట్టు మండలం మాకవరంలో పాంగి సతీష్‌ ఇంటిపై ఒడిశాకు చెందిన దుండుగులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వారిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. వాళ్లతో బీరువా తాళాలు తీయించి రూ.2.10లక్షల నగదు, నాలుగున్నర తులాల

బంగారం పట్టుకుపోయారు.

ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం దుండగులకు కలిసివస్తోంది. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రాలోకి మూడు మార్గాల్లో ప్రవేశించవచ్చు. జోలాపుట్టు, డుడుమ జలాశయాలపై ఉన్న మార్గాలతో పాటు పెదబయలులో ఒడిశాను ఆనుకుని నిర్మించిన వంతెన మార్గాన్ని దుండగులు ఎంచుకుంటున్నారు.

● పెదబయలు వంతెనపై ఎటువంటి గేట్లు లేకపోవడం, తనిఖీలు చేయకపోవడం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడుతోంది.ఆంధ్రా పరిఽధిలో నేరాలకు పాల్పడిన దుండగులు ఒడిశాలోకి వెళ్లిపోతున్నారు. వీరివద్ద మారణాయుధాలు ఉన్నందున అడ్డుకునేందుకు గిరిజనులు సాహసించలేకపోతున్నారు.

● జోలాపుట్టు, డుడుమ జలాశయాలపై ఉన్న మార్గాల్లో గేట్లు ఉన్నప్పటికీ తనిఖీలు జరగడం లేదు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు పట్టించుకోకపోవడంతో ఆంధ్రాలోకి వాహనాలు ఎంతో సులువుగా వచ్చేస్తున్నాయి. జలాశయాల వద్దకు వచ్చే వాహనాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల సరిహద్దు గ్రామాల్లో దొంగతనాలు చేసి సునాయాశంగా ఒడిశాలోకి పారిపోతున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాలోకి వెళ్లిపోతే వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. అందువల్ల దుండగులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

● ముంచంగిపుట్టు మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ రాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను కత్తులు, తుపాకులతో బెదిరించారు. బ్యాంకునుంచి అతను తీసుకువస్తున్న సుమారు రూ.10 లక్షల పింఛను సొమ్మును లాక్కొని ఒడిశావైపు వెళ్లిపోవడం తెలిసిందే. ఇలాంటి నేరాలకు తరచూ పాల్పడుతున్నారు.

● 2024 జూన్‌,జూలై నెలల్లో ముంచంగిపుట్టులో ఇంటి వద్ద ఉన్న నాలుగు బైక్‌లను అపహరించి ఒడిశా వైపు వెళ్లిపోయారు. 2022లో ఐదు నెలల వ్యవధిలో ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల్లో 21 బైకులు దొంగతనానికి గురయ్యాయి. వీటిలో కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన కొంతమంది నిందితులను అరెస్టు చేశారు.

● 2024లో తరచూ దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో సరిహద్దులో ఆంధ్రా గ్రామాల ప్రజలు రాత్రివేళల్లో గస్తీ కాసేవారు. దీంతో కొన్నాళ్లపాటు తగ్గుముఖం పట్టాయి.

పథకం ప్రకారం రెక్కీ..

మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ రాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం పింఛను సొమ్ము లాక్కొని పరారైన దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారు. సీసీ పుటేజీల ఆధారంగా ఈ విషయం నిర్థారణ అయింది. ముంచంగిపుట్టు మండలంలో 6,152 పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి పింఛను పంపిణీకి సంబంధించి రూ.2,61,71,000 అవసరం. పెదబయలు మండలంలో 6004 మంది పింఛనుదారులకు రూ.2,55,05,000 ఇవ్వాల్సి ఉంది. ఈ సొమ్మును ఆయా మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పెదబయలులోని ఎస్‌బీఐ నుంచి తీసుకువెళ్తుంటారు. ముంచంగిపుట్టులో ఎస్‌బీఐ ఉన్నప్పటికీ పెద్దగా టర్నోవర్‌ లేనందున పింఛను సొమ్ము డ్రా చేసే అవకాశం లేదు. దీనిని గమనించిన దుండగులు పథకం ప్రకారం దారికాసి తుపాకులు, కత్తులతో బెదిరించి పింఛను సొమ్మును పట్టుకుపోయారు.

ఇళ్ల వద్ద బైక్‌ల అపహరణ

కత్తులు, తుపాకులతో

బెదిరించి దారి దోపిడీలు

కొరవడిన నిఘా వ్యవస్థ

సునాయాసంగా తప్పించుకుంటున్న వైనం

భయాందోళనకు గురవుతున్న

ఉద్యోగులు, ప్రజలు

తనిఖీలు ముమ్మరం

ఆంధ్ర ఒడిశా సరిహద్దులో రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం.రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం.రాత్రి 11గంటల తరువాత అత్యవసర పనుల మినహా, ఎవరు తిరిగినా చర్యలు తీసుకుంటాం.కొన్ని జంక్షన్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. – బి.శ్రీనివాసరావు,

సీఐ, జి.మాడుగుల సర్కిల్‌

బరితెగింపు1
1/1

బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement