
పండుటాకులపై పగ
సాక్షి,పాడేరు: పండుటాకులు, దివ్యాంగులు పింఛను పొందేందుకు నరకం చూశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతినెలా ఒకటో తేదీ వేకువజామున పింఛను పొందిన వీరు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛను పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. శుక్రవారం గ్రామాల్లో అందరినీ ఒకచోటకు రప్పించడంతో పండుటాకులు, వితంతువులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లాలో 430 పంచాయతీల పరిధిలోని 5108 గ్రామాలు ఉండగా వీటిలో 1,23,046 మంది సామాజిక పింఛన్‌దారులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు ఒకొక్కరికి నాలుగు గ్రామాల్లో పింఛను పంపిణీ బాధ్యత అప్పగించడంతో వారంతా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పింఛనదారులను ఒక చోటకు రప్పించి అందజేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులకోసం గంటల తరబడి నిరీక్షించారు. మారుమూల గ్రామాల్లో పండుటాకుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
● పాడేరు మండలంలోని వనుగుపల్లి పంచాయతీలో సామాజిక పింఛన్‌దారులు తొలిరోజు పింఛన్ పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.గంటల తరబడి రోడ్లపై నిరీక్షించారు.దివ్యాంగులు కూడా ఇబ్బందులు పడే రోడ్డుకు చేరుకున్నారు.
● తామరాపల్లి గ్రామంలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నరకయాతన పడ్డారు. – మారుమూల చీడిపాలెంలోని వృద్ధులు, దివ్యాంగుడు సుమారు రెండు గంటల పాటు కొండల్లో నడిచి బంగారుమెట్టకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు పింఛన్‌సొమ్ము పొంది మళ్లీ అవస్థలు పడుతూ గ్రామానికి కాలినడకన చేరుకున్నారు. ఇలా ప్రతినెలా ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛను పొందేందుకు అష్టకష్టాలు
ఊరందరికీ ఒకేచోట పంపిణీ
ఉదయం 8గంటల నుంచి సచివాలయ సిబ్బందికోసం సడిగాపులు
ఇబ్బందులు పడిన దివ్యాంగులు,
వితంతువులు

పండుటాకులపై పగ