
విజృంభిస్తున్న జ్వరాలు
ముంచంగిపుట్టు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరాలు, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. వీరంతా పెద్ద సంఖ్యలో రావడంతో ఆరోగ్య కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 200కు పైగా ఓపీ నమోదు అయింది. గత వారం రోజుల్లో మూడువేలమందికి పైగా సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందారు. వీరిలో 366 మంది జ్వరాలతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోగా 50 మందికి టైఫాయిడ్, 9మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీరికి వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో సీహెచ్‌సీలోని 30 పడకలు నిండిపోయాయి. వైద్యాధికారులు గీతాంజలి, వివేక్, ధరణి పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణం రోగులతో నిండిపోవడంతో పాటు రక్తపరీక్షల గది ఎదుట రోగులు బారులు తీరారు. సీహెచ్‌సీలో 8మంది వైద్యులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో రోగులసంఖ్య పెరుగుతుండడంతో కిలగాడ,లబ్బూరు,రూడకోట పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ముంచంగిపుట్టు పీహెచ్‌సీకి
పెరిగిన రోగుల తాకిడి
నిండిపోయిన పడకలు
రక్తపరీక్షల గది వద్ద బారులు
టైఫాయిడ్, మలేరియా కేసుల నమోదు
వైద్యుల కొరతతో రోగుల ఇబ్బందులు

విజృంభిస్తున్న జ్వరాలు